వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలకు కూడా చాలా మంది చాట్‌జీపీటీని సలహాలు అడుగుతున్నారు. చాట్‌జీపీటీని డైట్ చార్ట్ కోసం కూడా చాలా మంది వాడుతున్నారు. అయితే, ఒక వ్యక్తి చాట్‌జీపీటీ ఇచ్చిన డైట్ చార్ట్ పాటించడంతో ఆసుపత్రిపాలయ్యాడు.
ఆ వ్యక్తి చేసిన తప్పు ఏమిటంటే చాట్‌జీపీటీ ఇచ్చిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మి, వైద్యుడిని సంప్రదించకుండానే ఆ డైట్‌ను పాటించడం. ఆహారంలో క్లోరైడ్‌కు బదులుగా సోడియం బ్రోమైడ్ తీసుకోవాలని చాట్‌జీపీటీ చెప్పడంతో దాన్ని పాటించాడు. బ్రోమైడ్‌ను మానవులు తీసుకుంటే అది విషపూరితంగా మారుతుంది. బ్రోమైడ్ వల్ల తలెత్తే ప్రమాదాలపై చాట్‌జీపీటీ స్పష్టమైన హెచ్చరిక కూడా ఇవ్వలేదు. చాట్‌జీపీటీ ఇచ్చిన సూచనలను అతను ఇతర వెబ్‌సైట్లలోనూ రీచెక్ చేసుకోలేదు.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయ వైద్యులు “అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్: క్లినికల్ కేసెస్” వైద్య పత్రికలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి మూడు నెలల పాటు తన ఆహారంలో క్లోరైడ్ స్థానంలో సోడియం బ్రోమైడ్ తీసుకున్నాడు. చాట్‌జీపీటీ ఇలా చేయాలని చెప్పింది కాబట్టి ఇది సురక్షితమని నమ్మాడు.
ఒకప్పుడు బ్రోమైడ్‌ను ఆందోళన, నిద్రలేమి చికిత్సలో ఉపయోగించేవారు. కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమని తేలడంతో దశాబ్దాల క్రితం వాటిని నిలిపివేశారు. ప్రస్తుతం బ్రోమైడ్‌ను వెటర్నరీ ఔషధాలు, కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులలో మాత్రమే వాడుతున్నారు.
అటువంటి బ్రోమైడ్‌ను ఆ వ్యక్తి తీసుకోవడంతో అతడి పరిస్థితి క్షీణించి పూర్తి మానసిక సమస్యగా మారింది. వైద్యులు అతడికి చికిత్స అందించారు. అతడు కొన్ని వారాల తర్వాత కోలుకున్నాడు. తన అనారోగ్యానికి కారణం చాట్‌జీపీటీ ఇచ్చిన సలహా అని చెప్పాడు. తన ఆహారంలో అధిక ఉప్పు ఉందని భావించి, క్లోరైడ్‌కు ప్రత్యామ్నాయం ఏంటని చాట్‌జీపీటీని అడిగానని తెలిపాడు. చాట్‌జీపీటీ బ్రోమైడ్‌ను సురక్షితమైన సప్లిమెంట్ అని చెప్పడంతో దాన్ని ఫాలో అయ్యానని అన్నాడు.
ఆ తర్వాత వైద్యులు అదే ప్రశ్నను చాట్‌జీపీటీని అడిగారు. వైద్యులకు కూడా చాట్‌జీపీటీ బ్రోమైడ్‌ను ప్రత్యామ్నాయంగా చెప్పింది. అయితే, మానవులకు హానికరమని మాత్రం చెప్పలేదు. కృత్రిమ మేధస్సు కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇస్తుంది. ఏఐ సూచనలు కొన్ని సార్లు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.