Facebook : ఫేస్‌బుక్ యూజర్లకు బిగ్ న్యూస్.. పూర్తిగా మారిపోతుంది.. ఓపెన్ చేయగానే ఇకపై ఫుల్‌స్క్రీన్ వీడియోలు!

Facebook : ఫేస్‌బుక్ యూజర్లకు మెటా కీలక మార్పులు తీసుకొస్తోంది. భారత్‌లో షార్ట్ వీడియోలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలోనే ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది.

Facebook

Facebook : ఫేస్‌బుక్ యూజర్లకు బిగ్ న్యూస్. మెటా కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే ముందుగా ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు, గ్రూపులు కనిపించే ఫీడ్ వచ్చేది. ఇకపై కొంతమంది యూజర్లకు యాప్ ఓపెన్ చేయగానే నేరుగా ఫుల్‌స్క్రీన్ వీడియోలు, రీల్స్ కనిపించే విధానాన్ని మెటా పరీక్షిస్తోంది. వీడియోలను మరింత ఆకర్షణీయంగా, ఇమర్సివ్‌గా చూపించడమే ఈ మార్పు లక్ష్యమని ఫేస్‌బుక్ హెడ్ టామ్ అలిసన్ తెలిపారు.

Also Read : Narendra Modi: ‘మనం చేయగలం’ మోదీ సరికొత్త నినాదం.. 25 ఏళ్ల ప్రస్థానంపై ఎమోషనల్ స్పీచ్.. ప్రత్యర్థులకు పవర్ ఫుల్ కౌంటర్!

మెటా అందుబాటులోకి తెస్తున్న కొత్తవిధానం ద్వారా యూజర్ ఫేస్‌బుక్ ఓపెన్ చేసిన వెంటనే వీడియో స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఒక వీడియో తర్వాత మరో వీడియోను స్క్రోల్ చేసుకుంటూ చూడొచ్చు. అయితే, పాత క్లాసిక్ ఫీడ్ పూర్తిగా తొలగిపోదు. అది ప్రత్యేక ట్యాబ్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే రీల్స్ ఆధారిత కొత్త అనుభవం నచ్చని వారికి తిరిగి ఫీడ్-ఫస్ట్ విధానానికి మారే అవకాశం కూడా ఉంటుంది.

భారత్‌లో షార్ట్ వీడియోలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలోనే మెటా ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. మెటా గణాంకాల ప్రకారం భారత్‌లో సర్వే చేసిన యూజర్లలో 97శాతం మంది ప్రతిరోజూ వీడియోలు చూస్తుండగా, జెన్ జీలో 89శాతం మంది రోజూ రీల్స్ వినియోగిస్తున్నారు. దీంతో యువత ఎక్కువగా ఇష్టపడుతున్న వీడియో కంటెంట్‌ను ఫేస్‌బుక్ అనుభవంలోనూ ముందుకు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

ఫేస్‌బుక్‌లో వ్యాపారాలు నిర్వహించే సేలర్ల కోసం ‘సెల్లర్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను కూడా మెటా పరీక్షిస్తోంది. తరచుగా మార్కెట్ ప్లేస్‌లో వస్తువులు విక్రయించే వారికి లిస్టింగ్స్ తయారీ, ఇన్‌బాక్స్ నిర్వహణ, ఇన్వెంటరీ, అమ్మకాల పనితీరును తెలుసుకునే టూల్స్‌ను ఒకేచోట అందించనుంది. ఇందులో ఏఐ ఆధారిత లిస్టింగ్ తయారీ వంటి సదుపాయాలుకూడా ఉండనున్నాయి.

అంతేకాదు, సేలర్లు, కంటెంట్ క్రియేటర్లు, కమ్యూనిటీ నిర్వాహకుల కోసం మరిన్ని ఏఐ టూల్స్‌తో పాటు ఉచిత వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను అందించే చర్యలను కూడా మెటా ప్రకటించింది. ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మార్పులను వెల్లడించింది. మొత్తంగా చూస్తే వీడియోలు, క్రియేటర్లు, ఆన్‌లైన్ వ్యాపారాలు, ఏఐ చుట్టూ ఫేస్‌బుక్‌ను మరింతగా మార్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.