AI Tools Dementia : చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని అతిగా వాడేస్తున్నారా? AIతో మతిమరుపు ముప్పు.. నిపుణుల హెచ్చరిక!
AI Tools Dementia : చాట్ జీపీటీ, క్లాడ్, జెమినిపై అతిగా ఆధారపడేవాళ్లలో వారి మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిపుణుల హెచ్చరిస్తున్నారు. దీనిపై అనేక పరిశోధనల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- July 14, 2026 / 10:34 PM IST
AI Tools Dementia
- AIకి మెదడును అప్పగిస్తే జరిగేది ఇదే
- మతిమరుపు ముప్పు వెనుక దాగిన కొత్త భయం
- ఏఐ ప్రభావంపై విద్యార్థులతో ప్రయోగాలు
- మెదడు చేయాల్సిన పనులను పూర్తిగా ఏఐకి అప్పగించరాదు
AI Tools Dementia : ఏఐ.. ఏఐ.. ప్రపంచాన్నే శాసిస్తోంది.. మనిషి కనిపెట్టిన ఈ ఏఐ టెక్నాలజీ మనిషి మెదడునే నాశనం చేస్తుందా? అంటే అధ్యయనాలు అదే చెబుతున్నాయి. ఒకప్పుడు మనిషి తన జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. అలాగే ఎన్నో చిక్కుముడుల వంటి సమస్యలను కూడా క్షణాల్లో పరిష్కరించేవాడు.. ప్రతి చిన్న విషయానికి ఎలా చేయాలి? ఎలా సాధించాలో లోతుగా ఆలోచించేవాడు. కానీ, ఇప్పుడు ఏఐ దెబ్బకు ఆలోచన శక్తిని కోల్పోతున్నాడు.
ఏఐ టూల్స్ ఎఫెక్ట్.. ఆలోచన శక్తి మందగిస్తుందా? :
సెకన్ల వ్యవధిలోనే సమాధానం ఇచ్చే ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం దొరికిపోతోంది. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ టూల్స్ కళ్లుమూసి తెరిచేలోగా ఆన్సర్ ఇచ్చేస్తున్నాయి. అయితే ఏఐ టూల్స్ ఎక్కువ వాడకంపై ఓ సరికొత్త భయం మొదలైంది.. మనిషి తన ఆలోచనా శక్తిని నెమ్మదిగా కోల్పోతున్నాడా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఏఐపై అతిగా ఆధారపడటాన్ని నిపుణులు ‘కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్’గా పిలుస్తున్నారు. అంటే.. మన మెదడు చేయాల్సిన పనులను పూర్తిగా దానికి అప్పగించకూడదని సూచిస్తున్నారు. అదేపనిగా ప్రతిచిన్న పనికి కూడా ఏఐపై ఆధారపడొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన మెదడుకు ఆలోచించే శక్తి పెరగాలని, నిరంతరం ఆలోచించడం, విశ్లేషించడం, గుర్తుంచుకోవడం వంటి పనులు తగ్గిపోతే మెదడు చురుకుదనం తగ్గిపోయి చివరికి మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Read Also : Vehicle Tracking : ‘ఒక్క బటన్.. చాలు’.. వాహనం ఎక్కడున్నా క్షణాల్లో కనిపెట్టే సేఫ్టీ ట్రాకర్!
మెదడు పనితీరుపై ఏఐ ప్రభావం :
ఇటలీలోని సీనా యూనివర్శిటీకి చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ సిమోన్ రోస్సీ అధ్యయనం చేయగా.. సాధారణ పనులకు కూడా ఏఐ పూర్తిగా ఆధారపడటం మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. ‘విమర్శనాత్మక ఆలోచన లేకుండా ఏఐని వాడటం వల్ల మెదడు అభివృద్ధికి అవసరమైన చురుకుదనం తగ్గవచ్చునని ఆయన హెచ్చరించారు. ఏఐ వినియోగంపై అనేక ప్రయోగాలు జరిగాయి. అందులో మరెన్నో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.
విద్యార్థులపై ప్రయోగాలు :
ఈ ప్రయోగాల్లో భాగంగా కొందరు విద్యార్థులను 3 గ్రూపులుగా విభజించి వారికి ఎస్సేలు రాయమని చెప్పారు. కానీ, ఏఐ సాయంతో రాసిన విద్యార్థులు కొంతకాలం తర్వాత తాము రాసిన విషయాలను గుర్తు చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారని రీసెర్చర్లు గుర్తించారు. మరోవైపు, స్వయంగా ఆలోచించి రాసిన విద్యార్థుల మెదడు కార్యకలాపాలు అద్భుతంగా కనిపించాయని గుర్తించారు.
అయితే, ఏఐ పూర్తిగా ప్రమాదకరమని నిపుణులు చెప్పడం లేదు. మీరు సరైన పద్ధతిలో ఏఐని వాడితే అది మనిషి సామర్థ్యాన్ని పెంచే మంచి టూల్‌గా మారుతుందని అంటున్నారు. కానీ, ప్రతి చిన్న ఆలోచన కూడా ఏఐకి అప్పగిస్తే అది మనిషి మెదడుకు అవసరమైన ‘వ్యాయామం’ తగ్గే రిస్క్ ఉందని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులోనూ అతి పెద్ద ప్రశ్న ఇదే.. ఏఐ మన జీవితాలను మరింత ఈజీ చేస్తుందా? లేక మనం ఆలోచించే శక్తినే దానికి అప్పగిస్తామా? అనేది మన చేతుల్లోనే ఉంటుంది.
