×
Ad

చైనా తయారు చేసిన రోబో డాగ్‌ను తీసుకొచ్చి.. “మేమే తయారుచేశాం” అని చెప్పుకున్న మన వర్సిటీ.. చివరకు

"గల్గోటియాస్ విశ్వవిద్యాలయ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ఓరియన్‌ను అభివృద్ధి చేసింది" అని ఆమె చెప్పింది. ఈ వీడియో వైరల్ అయింది.

  • ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ 2026
  • రోబో డాగ్‌ను ప్రదర్శించిన గల్గోటియాస్ వర్సిటీ
  • అది చైనా రోబో డాగ్‌ అని గుర్తించిన నెటిజన్లు
  • ఎక్స్‌పో ఏరియా నుంచి వర్సిటీని వెళ్లగొట్టిన నిర్వాహకులు

AI Impact Summit 2026: ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో గల్గోటియాస్ విశ్వవిద్యాలయం పరువుపోయింది. ఆ వర్సిటీ గ్రేటర్ నోయిడాలో ఉంటుంది. ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో వర్సీటీలు, ఏఐ నైపుణ్యాలు ఉన్నవారు తమ సొంత ప్రాజెక్టులను ప్రదర్శిస్తుంటారు.

గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ఓ చైనా రోబో డాగ్‌ను ప్రదర్శించి, దాన్ని తమ వర్సిటీకి చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అభివృద్ధి చేసిందని చెప్పుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

దీంతో ఎక్స్‌పో ఏరియాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని గల్గోటియాస్ విశ్వవిద్యాలయానికి ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రతినిధులు చెప్పారు.

గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ప్రదర్శించిన రోబో డాగ్ పేరు యూనిట్రీ జీవో2. చైనా రోబోటిక్ కంపెనీ యునిట్రీకి చెందిన రోబో అది. భారత్‌లో ఆన్‌లైన్‌లో ఆ రోబోలను రూ.2 లక్షలు-రూ.3 లక్షల మధ్య రేటుకు అమ్ముతుంటారు.

గల్గోటియాస్ విశ్వవిద్యాలయ మహిళా ప్రతినిధి ఆ రోబో డాగ్‌ను “ఓరియన్” పేరిట ప్రదర్శిస్తూ దాని ఫీచర్ల గురించి వివరించింది. “గల్గోటియాస్ విశ్వవిద్యాలయ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ఓరియన్‌ను అభివృద్ధి చేసింది” అని ఆమె చెప్పింది. ఈ వీడియో వైరల్ అయింది.

అదే వర్సిటీకి చెందిన మరో ప్రొఫెసర్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇందుకు సంబంధించిన క్లిప్‌ కూడా వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు అసలు విషయాన్ని గుర్తించారు.

ఆ రోబో డాగ్ చైనా నుంచి దిగుమతి చేసుకున్న యునిట్రీ జీవో2కు చెందిన మెషీన్‌ అని కామెంట్లు చేశారు. విదేశీ టెక్నాలజీని భారత ఆవిష్కరణగా ఆ యూనివర్సిటీ చెప్పుకుంటోందని విమర్శలు వచ్చాయి.

గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ఏమంది?
తీవ్ర విమర్శలు వస్తుండడంతో గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ఎక్స్‌లో ఓ ప్రకటన చేసింది. తాము ఆ రోబో డాగ్‌ను యునిట్రీ కంపెనీ నుంచే కొన్నామని చెప్పింది. దాన్ని విద్యార్థుల అభ్యాస సాధనంగా వాడుతున్నామని తెలిపింది. ఆ రోబో డాగ్‌ను తామే అభివృద్ధి చేశామని ఎక్కడా చెప్పలేదని పేర్కొంది.