UPI New Rules
UPI New Rules : యూపీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1, 2025 నుంచి కొత్త యూపీఐ రూల్స్ రాబోతున్నాయి. మీరు PhonePe, Google Pay, Paytm వంటి యూపీఐ (UPI New Rules) యాప్‌ల ద్వారా ప్రతిరోజూ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే.. యూపీఐ పేమెంట్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది.
ఈ కొత్త నిబంధనలతో యూపీఐ రోజువారీ డిజిటల్ పేమెంట్లపై ఎఫెక్ట్ పడనుంది. భారత్‌లో ప్రతి నెలా 16 బిలియన్లకు పైగా లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. కానీ, చాలా సార్లు సర్వర్ అంతరాయం కారణంగా యూపీఐ పేమెంట్లు ఫెయిల్ అవుతాయి. దీనిపై వినియోగదారులు కంప్లయింట్ చేస్తుంటారు. ఈ యూపీఐ సమస్యలను తగ్గించేందుకు NPCI మొత్తం 7 ప్రధాన మార్పులను చేసింది. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
బ్యాలెన్స్ చెకింగ్‌పై లిమిట్ :
బ్యాంకు బ్యాలెన్స్ చెకింగ్ లిమిట్.. ఇప్పుడు మీరు యూపీఐ యాప్ నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు. బ్యాలెన్స్‌ను పదే పదే చెక్ చేయడం వల్ల సర్వర్‌పై లోడ్ పెరుగుతుంది. తద్వారా పేమెంట్ స్లో అవుతుంది.
లింక్డ్ బ్యాంక్ అకౌంట్లపై చెకింగ్ లిమిట్ :
మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లను రోజుకు 25 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. సిస్టమ్‌పై అనవసరమైన లోడ్ తగ్గుతుంది. అలాగే ఫ్రాడ్ వంటి మోసాలు జరిగే అవకాశం కూడ తగ్గుతుంది.
ఆటోపే పేమెంట్లలో మార్పు :
నెట్‌ఫ్లిక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదాల వంటి ఆటోపే పేమెంట్లు ఇప్పుడు కేవలం 3 టైమ్ స్లాట్‌లలో ప్రాసెస్ అవుతాయి. ఈ సమయాలు ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 9.30 తర్వాత ఇలా ఉంటాయి. ఈ టైమ్ గ్యాప్ ద్వారా పీక్ అవర్స్ సమయంలో యూపీఐ సర్వర్‌పై లోడ్ తగ్గుతుంది.
పేమెంట్ చెకింగ్ లిమిట్ :
మీరు యూపీఐ పేమెంట్ స్టేటస్ ఎక్కువసార్లు చెక్ చేయలేరు. ఇప్పుడు ఫెయిల్ పేమెంట్ స్టేటస్ రోజుకు 3 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. ప్రతి స్టేటస్ చెకింగ్ మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉండాలి. స్టేటస్ పదే పదే చెక్ చేయడం వల్ల యూపీఐ సిస్టమ్ స్లో అవుతుంది.
పేమెంట్ చేసే ముందు బ్యాంక్ పేరు :
ఆగస్టు 1 నుంచి కొత్త రూల్ ఏమిటంటే.. పేమెంట్ చేసే ముందు రిసీవర్ రిజిస్టర్డ్ బ్యాంక్ పేరు కనిపిస్తుంది. డబ్బు తప్పు ఖాతాకు వెళ్లడం లేదా మోసానికి గురయ్యే రిస్క్ ఉండదు.
పేమెంట్ రివర్సల్ లిమిట్ :
ఛార్జ్‌బ్యాక్ లిమిట్ అంటే.. పేమెంట్ రివర్సల్ చేయడం. మీరు 30 రోజుల్లో 10 సార్లు ఏదైనా ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి 5 సార్లు ఛార్జ్‌బ్యాక్ రిక్వెస్ట్ అడగవచ్చు.
బ్యాంకులు, యాప్‌లకు ఆదేశాలు :
యూపీఐ వ్యవస్థలో ఎలాంటి లోపం లేకుండా API వినియోగాన్ని పర్యవేక్షించాలని NPCI బ్యాంకులు, యాప్‌లను ఆదేశించింది. ఇకపై యూపీఐ యూజర్లు బ్యాలెన్స్‌ను పదేపదే చెక్ చేయడం లేదా స్టేటస్ పదేపదే రిఫ్రెష్ చేయకూడదు.
ఆటోపే కోసం నాన్-పీక్ టైమ్ తెలుసుకోవాలి. పేమెంట్లకు ముందు రిసీవర్ పేరును చెక్ చేయండి. ఈ కొత్త యూపీఐ రూల్స్ ద్వారా పేమెంట్లు సేఫ్‌గా స్పీడ్ చేయొచ్చు. తద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా డిజిటల్ పేమెంట్లను పూర్తి చేయొచ్చు.