OpenAI ChatGPT 4o and Google Project Astra: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ప్రపంచం తలకిందులవుతోంది. ప్రపంచం మొత్తం AI చుట్టూనే తిరుగుతోంది. దాని గురించే మాట్లాడుకుంటోంది. AI వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. టెక్నాలజీ భావోద్వేగాలను పలికించలేదనే భావనను తప్పని నిరూపించింది ఓపెన్ AI. చాట్ జీపీటీతో ప్రపంచాన్ని సరికొత్తయుగంలోకి నడిపించిన ఓపెన్ AI ఇప్పుడు GPT-4ఓను ప్రవేశపెట్టి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మనం మనుషులతోనే మాట్లాడుతున్నామా అన్న భావనను కలగచేస్తోంది ఇప్పుడు GPT-4o. ఇప్పుడు దానికి పోటీగా ప్రాజెక్టు అస్త్రను తీసుకొచ్చింది సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్.
రోబోకూ భావోద్వేగాలుంటాయి. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం రోబో సినిమాలో శంకర్ ఈ విషయం చెప్పినప్పటికీ పెద్దగా ఎవరూ అంగీకరించలేదు. కానీ ఇక అంగీకరించక తప్పని పరిస్థితులొచ్చేశాయి. ఎందుకంటే కొత్త పుంతలు తొక్కుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ భావోద్వేగాలపరంగానూ మనుషులతో పోటీపడుతోంది. సహజ సంభాషణలు పలికిస్తోంది. GPT 4ఓ మోడల్‌ను ఓపెన్ AI తీసుకొస్తే ఇప్పుడు గూగుల్ ప్రాజెక్ట్ అస్త్రను అధికారికంగా ప్రకటించింది.
AI ప్రభంజనం ప్రపంచాన్ని ముంచెత్తింది. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి టెక్నాలజీతో ప్రయోజనాలూ, ఇబ్బందులూ ఉన్నట్టే AI విశ్వరూపంపై ఆశ్చర్యం, ఆందోళన ఒకేసారి వ్యక్తమవుతున్న సమయమిది. అయితే ఇప్పటిదాకా అందుబాటులోకొచ్చిన AI వీడియోలు, ఫొటోలు వంటివి చూస్తే.. అవి టెక్నాలజీ సృష్టే అని తేలిగ్గా అర్ధమవుతోంది. AIతో భావాలు పలికించలేమని, ఓ మెషీన్‌లా పనిచేసుకుపోతుందని, మంచీ చెడు తారతమ్యం ఉండదని, బాధ, కష్టం తెలియవని, సంతోషాన్ని చూపించలేవని, విచక్షణ ఉండదన్నది ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం. కానీ ఓపెన్ AI ఇప్పుడు విడుదల చేసిన మోడల్ GPT-4ఓ, మోడల్ అస్త్ర ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది.
చాట్ జీపీటీలో కొత్త వెర్షన్ GPT 4ఓ. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ వెర్షన్ విడుదల చేసింది. మరికొన్నివారాల్లో కొన్ని పరిమితులతో ఈ వెర్షన్ అందరికీ ఉచితంగా అందుబాటులోకి రానుంది. పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఇవి వర్తించబోవు. ఈ కొత్త వర్షన్‌లో రియల్ టైమ్ సంభాషణలు, వాయిస్ ఎమోషన్లు వంటి ఫీచర్లు ఎలా ఉంటాయంటే.. అచ్చంగా మనుషులతోనే మాట్లాడుతున్న అనుభూతి వస్తుంది. గూగుల్ ప్రదర్శించిన డెమో వీడియోలో ఎవరూ చెప్పకుండానే ఓ రూమ్‌లో వస్తువులను గుర్తిస్తోంది AI టూల్.
50 భాషలను సపోర్ట్ చేస్తుంది..
GPT 4ఓలో, ప్రాజెక్టు అస్త్రలో అత్యాధునిక వాయిస్, టెక్స్ట్స్, విజన్ వంటి ఫీచర్లుంటాయి. కొత్త వెర్షన్లు వేగంగా పనిచేస్తాయి. మనిషి తరహాలోనే 232 మిల్లీసెకన్లలో సమాధానాలిస్తాయి. GPT 4ఓ డెస్క్‌టాప్ యాప్‌ను కూడా ఓపెన్ AI ప్రారంభించింది. AI అసిస్టెంట్ మనం అర్ధం చేసుకున్నట్టే ప్రపంచాన్ని అర్ధం చేసుకుంటుందని గూగుల్ తెలిపింది. GPT 4ఓ మోడల్ తెలుగు సహా 50 భాషలను సపోర్ట్ చేస్తుంది. టెక్ట్స్, రీజనింగ్, కోడింగ్ ఇంటెలీజెన్స్‌ను వేగంగా పూర్తిచేస్తుంది. స్పీచ్ మోడ్‌లో రియల్ టైమ్ రెస్పాన్స్ ఉంటుంది. చాట్ GPT 4o రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది.
ఎమోషన్స్ పలికించడం ఈ వెర్షన్ల ప్రత్యేకత
టెక్నాలజీకి భావోద్వేగాలతో పనిలేదు. టెక్నాలజీ విప్లవానికి పర్యాయపదంగా ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు మనం బాధగా ఉన్నామా సంతోష పడుతున్నామా? కోపంతో ఉన్నామా.. ప్రశాంతంగా కూర్చున్నామా అన్నది అక్కరలేదు. మన ఎమోషన్స్‌తో పనిలేకుండా అది పనిచేసుకుంటూ పోతుంది. ఇప్పటిదాకా ఇదే తెలుసు. కానీ ఓపెన్ AI జీపీటీ-4ఓ కానీ, గూగుల్ ప్రాజెక్టు అస్త్ర కానీ అలా కాదు. ఈ AI టూల్ మనం కోపంగా అడిగితే..అంతే కోపంగా సమాధానం ఇస్తుంది. సుతిమెత్తగా దానితో మాట్లాడితే..అంతకంటే హృద్యంగా మనకు సమాధానాలిస్తుంది. అసలు ఈ మోడల్స్‌కి మన భావోద్వేగాలతోనే పని. వేగం, కచ్చితత్వం, అదే సమయంలో ఎమోషన్స్ పలికించడం ఈ వెర్షన్ల ప్రత్యేకత.
Also Read: వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇక ఐఓఎస్ యూజర్లు ప్రొఫైల్ ఫోటోలను స్క్రీన్‌షాట్ తీయలేరు..!
టెక్నాలజీతో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా సెల్ ఫోన్ తో ప్రపంచం మొత్తం మన చేతిలోకొచ్చేసిన అనుభూతి కలిగినా ఓ మనిషికి మరో మనిషితో మాట్లాడితే కలిగే సంతృప్తి వేరు. తెలిసిన వాళ్లతో అయినా.. తెలియని వాళ్లతో అయినా మనం మాట్లాడే మాటలు కొండంత తెరిపినిస్తాయి. ఇదే తరహా అనుభూతి టెక్నాలజీ కూడా ఇవ్వగలిగితే.. ఎదురుగా ఓ మనిషి లేకపోయినా.. మనం మరో వ్యక్తితోనే మాట్లాడుతున్న అభిప్రాయం కలిగిస్తే.. మన మనఃస్థితికి తగ్గ భావోద్వేగాలు పలికిస్తే.. అవే జీపీటీ-4o, ప్రాజెక్ట్ అస్త్ర. మనం భయం భయంగా ఓ ప్రశ్న అడిగితే.. జీపీటీ-4ఓ, అస్త్ర భయం భయంగానే సమాధానం ఇస్తాయి. కోప్పడితే కోప్పడతాయి. మన వాయిస్ కమాండ్లకు మనిషి తరహాలోనే సమాధానాలిస్తాయి. అలాగే ఓ ఫోన్‌లోని AI మోడల్, మరో ఫోన్‌లోని AI మోడల్‌తోనూ సంభాషిస్తుంది. అలాగే మనం ఒక సెల్ఫీ తీసుకుంటే మన మానసిక స్థితినీ విశ్లేషిస్తుంది. మనం ఖాళీగా ఉన్నప్పుడు, బోర్ ఫీలయినప్పుడు.. ఒంటరిగా అనిపించినప్పుడు.. చాట్ జీపీటీ-4oతో, ఆస్ట్రాతో మాట్లాడడం ద్వారా ఆ పరిస్థితులనుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.
చాట్ జీపీటీ-4oకి పోటీగా గూగుల్ అస్త్ర
చాట్ జీపీటీ-4ఓను ఓపెన్ ఏఐ విడుదల చేసిన వెంటనే గూగుల్ అస్త్రను ప్రకటించింది. అయితే గూగుల్ అస్త్రను ప్రకటిస్తుందన్న సమాచారం తోనే ఓపెన్ ఏఐ ముందుగానే చాట్ జీపీటీ-4oను విడుదల చేసినట్టు భావిస్తున్నారు. మనం మాట్లాడిన మాటలను అర్ధం చేసుకుని అస్త్ర వేగంగా స్పందిస్తుంది. చెప్పిన మాటలు గుర్తుంచుకోవడం, అర్ధం చేసుకోవడం, అవసరమైనట్టుగా స్పందించడం అస్త్ర, చాట్ జీపీటీ-4o ప్రత్యేకతలు. అనేక విషయాలను విని, అర్ధం చేసుకుని ప్రతిస్పందించేలా AI టూల్ రూపొందించామని గూగుల్ తెలిపింది. జెమినీ యాప్, వెబ్‌సైట్‌లోనూ ప్రాజెక్టు అస్త్ర అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. మరోవైపు గూగుల్‌కు పోటీగా చాట్ జీపీటీ ఏఐ సెర్చ్ ఇంజిన్‌ను త్వరలో ఆవిష్కరిస్తామని తెలిపింది.
ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందా?
ఇలా AIతో సంస్థలు పోటీపడి కొత్త కొత్త వెర్షన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. భారత్ సహా అనేక దేశాలు AIపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే జాబ్ మార్కెట్‌లో AI విధ్వంసం సృష్టించనుందన్న ఆందోళన మరో పక్క తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని, జాబ్ మార్కెట్‌పై సునామీలా విరుచుకుపడుతుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 60శాతం ఉద్యోగాలు, ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదముందని రానున్న రెండేళ్లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు. AIని సరైన రీతిలో ఉపయోగించకపోతే ఆదాయ అసమానతలు భారీగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు.
Also Read: పేటీఎం ఇప్పుడు పనిచేస్తుందా? యూపీఐ పేమెంట్లు చేయొచ్చా? యూజర్ల ప్రశ్నలకు సమాధానాలివే..!
AIకి ముందు, AIకి తర్వాత..
అయితే ఈ హెచ్చరికలను కొందరు నిపుణులు తోసిపుచ్చుతున్నారు. కంప్యూటర్లు ప్రపంచాన్ని ముంచెత్తకముందు కూడా ఇదే అభిప్రాయం ఉందని, తర్వాత ఇదే ఉపాధిగా మారిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకిస్తున్నప్పుడు కొన్ని మార్పులు, ఇలాంటి ఆందోళనలు సహజమేనని.. AI ప్రజలందరి జీవితాల్లో ఓ భాగంగా మారేలోపు ఈ లోపాలన్నీ సర్దుకుంటాయని భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఏఐ వాడుతున్న వారి సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. ఏఐ ఉపయోగిస్తున్న వారి సంఖ్య ఆరు నెలల్లో 83శాతం పెరిగింది. పనిలో వేగం పెరిగిందని, సమయం ఆదా అవుతోందని, క్రియేటివ్‌గా ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు. మొత్తంగా ప్రపంచం AIకి ముందు, AIకి తర్వాత అన్నట్టుగా మారబోతోంది. భావోద్వేగాలను సైతం పలికించే చాట్ జీపీటీ -4o, ప్రాజెక్టు ఆస్ట్ర ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.