రజినీకాంత్ నటించిన రోబో సినిమా క్లైమాక్స్‌కి ముందు రోబో ఒకే సమయంలో పలు ప్రాంతాల్లో భారీ చోరీలకు పాల్పడుతుంది. ఒకే రోబో వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి ఉండడం ఎలా సాధ్యమని మొదట ఆ సినిమాలో పోలీసులు తికమకపడతారు. ఆ తర్వాత ఒక్క రోబో చాలా రోబోలను తయారు చేసిందని, వాటితో ఈ పనులన్నీ చేయిస్తుందని అందరికీ తెలుస్తుంది.
అయితే, నిజ జీవితంలోనూ ఒకే ఒక్క మనిషి అనేక కంపెనీల్లో పనిచేయడం సాధ్యం అవుతుందా? భారత్‌కు చెందిన సోహమ్ పరిక్ అనే యువకుడు అనేక స్టార్టప్‌లలో ఒకే సమయంలో ఉద్యోగాలు చేస్తున్నాడు. ఒక సంస్థలో పని చేస్తున్నట్లు మరో సంస్థకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు. వర్క్ ఫ్రం హోమ్‌ను బీభత్సంగా వాడుకుంటున్నాడు.
మూన్‌లైటింగ్ మరీ ఈ రీతిలోనా?
ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తూ మరో కంపెనీలో లేదా మరో ప్రాజెక్ట్‌లో పని చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. కంపెనీలు తమ ఉద్యోగ నిబంధనల ప్రకారం మూన్‌లైటింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాయి.
టెక్ రంగంలో మూన్‌లైటింగ్‌కు ఒప్పుకోరు. ఒక కంపెనీలో పనిచేస్తున్నవారు మరో సంస్థలో కూడా పని చేస్తే సంస్థల పనితీరు ప్రభావితమవుతుంది. అయినప్పటికీ, కంపెనీల కళ్లుగప్పి సోహమ్ పరిక్ అనేక కంపెనీల్లో ఏకకాలంలో పని చేశాడు.
చాలా కంపెనీలు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు చేస్తూ, చాలా మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తున్నాయి. ఇప్పుడు పరిక్‌పై వచ్చిన ఆరోపణలతో టెక్ రంగంలో వర్క్ ఫ్రం హోం, నియామక విధానాలు, నైతికతపై చర్చ జరుగుతోంది.
యూఎస్‌లోని మిక్స్‌ప్యానెల్ వ్యవస్థాపకుడు సుహైల్ దోషీ ఇటీవలే సోహమ్ పరిక్ చేస్తున్న మూన్‌లైటింగ్‌ను గుర్తించి సోషల్ మీడియాలో పలు ఆరోపణలు చేశారు. పరిక్ పలు కంపెనీలను మోసం చేస్తున్నాడని దోషీ అన్నారు.
పరిక్ సీవీను కూడా షేర్ చేస్తూ దానిలో 90 శాతం సమాచారం అసత్యమని ఆయన తెలిపారు. ఇతర స్టార్టప్ వ్యవస్థాపకులు, ఇంజనీర్లు, హైరింగ్ మేనేజర్లు కూడా పరిక్‌పై ఇదే విధంగా ఆరోపణలు చేశారు. ఈ వార్త టెక్ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది.
సుహైల్ దోషి ఎక్స్‌లో సోహమ్ పరిక్ గురించి ఇతర స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులను హెచ్చరించడంతో వివాదం మొదలైంది. పరిక్ మిక్స్‌పానెల్‌లో కొద్దికాలం పనిచేశాడని, ఆపై తొలగించామని దోషి ఆరోపించారు. ఆ తర్వాత సిలికాన్ వ్యాలీలోని ఇతర స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, ఇంజనీర్లు, నియామక సంస్థలకు చెందిన వారు కూడా పరిక్ తీరుపై విమర్శలు గుప్పించారు.
ఈ వార్త సిలికాన్ వ్యాలీ, భారత టెక్ కమ్యూనిటీలలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ఇంజనీర్లు దీనిని అత్యంత దారుణమైన ఉద్యోగ మోసాలలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.
సోహమ్ పరిక్ రెజ్యూమెలో పేర్కొన్న అంశాలు
వృత్తి అనుభవం
పరిక్ రెజ్యూమెలో పేర్కొన్న ఎక్స్‌పీరియన్స్‌ను చూస్తే దిమ్మతిరిగిపోతుంది. అనేక టెక్ స్టార్టప్‌లలో పనిచేసినట్లు పేర్కొన్నాడు.
టాలెంట్ మాత్రం అద్భుతం
ఉద్యోగంలో పరిక్ టాలెంట్ మాత్రం అద్భుతం. ఒక ఉద్యోగి మూడు గంటల్లో చేసే పనిని పరిక్ ఒక గంటలో పూర్తి చేస్తాడు. ఇంటర్వ్యూలు చేసేవారిని బాగా ఆకర్షిస్తాడు. తనకున్న సాంకేతిక నైపుణ్యాలను చక్కగా వివరిస్తాడు. అయితే, అనేక కంపెనీల్లో ఒకే సమయంలో పనిచేస్తూ తన టాలెంట్‌ను తప్పుడు విధానాలతో అతడు దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి.
పరిక్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వస్తున్నాయి. అతడిని చాలా మంది “కార్పొరేట్ మజ్దూర్” అని అభివర్ణిస్తున్నారు. అతడిపై మీమ్స్, జోకులతో సోషల్ మీడియా నిండిపోతోంది. తనపై వస్తున్న ఆరోపణలపై సోహమ్ పరిక్ స్పందించలేదు.
PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.
I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.
— Suhail (@Suhail) July 2, 2025