Google Doodle
Google Doodle: భారత్‌లో ఇడ్లీకి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ భారత్‌లో ప్రజలు ఇడ్లీ అంటే పడిచస్తారు. అనారోగ్యంగా ఉన్న సమయంలోనూ ఇడ్లీలనే తింటారు.
ఇవాళ గూగుల్ డూడుల్ ఇడ్లీలతో ప్రత్యేకంగా కనపడుతోంది. గూగుల్ ఫుడ్ థీమ్‌లో భాగంగా ఇటువంటి వంటకాలను డూడుల్‌లను రూపొందిస్తోంది. అందుకే ఇవాళ గూగుల్ డూడుల్‌లో ‘సెలబ్రేటింగ్ ఇడ్లీ’ పేరిట డూడుల్ కనపడుతోంది.
ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను కూడా చూపించారు. ఇడ్లీ పిండిని నానబెట్టడంతో పాటు ఇడ్లీ పాత్రలోపలి భాగం, సాంబార్, చట్నీ వంటివి ఇందులో చూడొచ్చు. డూడుల్ మన ఇడ్లీ రూపంలో కనపడడంతో మనవాళ్లని ఇది బాగా ఆకట్టుకుంటోంది.
మన దేశంలో కోట్లాది మంది ప్రతిరోజు ఆస్వాదించే అల్పాహారానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా డూడుల్ ఉంది. “ఇవాళ డూడుల్ దక్షిణ భారత వంటకం ఇడ్లీకి ప్రాముఖ్యత ఇస్తోంది. ఇది బియ్యం, మినప పప్పు పులియబెట్టిన పిండితో తయారుచేసే వంటకం” అని గూగుల్ అధికారిక డూడుల్స్ పోర్టల్‌లో పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో #loveidli వైరల్ అవుతోంది. నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, అల్పాహార ఫొటోలను, అమ్మమ్మలు నేర్పిన వంటకాలను కూడా షేర్ చేస్తున్నారు.
ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని అధికారికంగా మార్చి 30న జరుపుకుంటారు. కానీ, అక్టోబర్ 11తో ఇడ్లీకి ఎలాంటి సంబంధం లేదు. గూగుల్ తరచుగా ప్రజలందరినీ కలిపే వంటకాలకు సాంస్కృతిక నివాళిగా డూడుల్‌లను విడుదల చేస్తుంది.
అందులో భాగంగానే అక్టోబర్ 11న డూడుల్ ఇడ్లీని పోషకమైన, వెగన్, గ్లూటెన్ లేని సూపర్‌ఫుడ్‌గా ప్రాధాన్యాన్నిస్తోంది. ఇది ప్రాంతాలు, తరాలు, దేశాల సరిహద్దులను దాటి ప్రజలను కలిపిన వంటకం. సూపర్‌ఫుడ్ అంటే అత్యధిక పోషక విలువ కలిగిన ఆహారం. ఇడ్లీ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దానికి ఉండే మంచి రుచి వల్ల చెన్నై నుండి చికాగో వరకు దాన్ని తినేవారు ఉన్నారు.