Telangana Assembly Elections 2023 : పార్టీల మ్యానిఫెస్టోల్లో వాగ్దానాలు పుష్కలం.. రాష్ట్ర ఖజానాలో నిధులు అంతంతమాత్రం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పక్షాలు వారి మ్యానిఫెస్టోల్లో వాగ్ధానాల వర్షం కురిపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే వాటికి నిధులు ఎలా సమకూర్చుకుంటారనేంది ప్రశ్నార్థకంగా మారింది....

brs,congress,bjp

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పక్షాలు మ్యానిఫెస్టోల్లో వాగ్ధానాల వర్షం కురిపించాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే వాటికి నిధులు ఎలా సమకూర్చుకుంటారనేంది ప్రశ్నార్థకంగా మారింది. ఓటర్లకు ఇచ్చిన హామీలు అధికంగా ఉండగా వాటిని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఖజానాలో నిధులు మాత్రం అంతం మాత్రంగానే ఉన్నాయి.

పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీల వర్షం

మూడు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రకటించేశాయి. తెలంగాణలో నిధుల కొరతతో పార్టీలు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అలవికానీ, అమలు చేయలేని హామీలపై ఆర్థికశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచితాలతో అభివృద్ధి ఎలా సాధ్యమని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఓటర్లను సోమరిపోతులను చేసేలా ఉన్న నగదు బదిలీ పథకాలతో ఆర్థికాభివృద్ధి కుంటుపడే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఓపీఎస్‌ల జీతాల చెల్లింపులకే రాష్ట్ర రెవెన్యూలో 60శాతం నిధులు అవసరమని ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు.

నిధులు ఎలా సమకూరుతాయి? 

పార్టీలు ఇచ్చిన ఈ వాగ్దానాల అమలుకు ఎలా నిధులు సమకూరుతాయనేది అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2.90 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాలను ఆమోదించింది. ప్రధాన రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రస్తుత బడ్జెట్ సరిపోదని స్పష్టంగా తెలుస్తోంది. బీఆర్‌ఎస్ హామీలను అమలు చేయడానికి అదనంగా రూ. 50,000 కోట్లు, కాంగ్రెస్ వాగ్దానాలను నెరవేర్చడానికి అదనంగా రూ. 80,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి. ఈ నిధులు ఎక్కడి నుంచి సమీకరించాలనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది.

రైతుబంధు, పెన్షన్ల పెంపు ఎలా?

తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వచ్చే అయిదేళ్లలో ఆసరా పెన్షన్లను రూ.5,016కు పెంచుతామని హామీ ఇచ్చింది. 2023-24వ ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ సర్కారు ఆసరా పింఛన్ కోసం 12వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పెన్షన్లను 150 శాతం పెంచుతామని హామీ ఇచ్చిన దృష్ట్యా వచ్చే అయిదేళ్లలో వీటికి 30వేల కోట్లరూపాయలు అవసరమవుతాయని అంచనా. రైతు బంధు కింద రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీని ఎకరానికి రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచుతామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. గత ఏడాది బడ్జెట్ అంచనాల్లో రైతుబంధు పథకానికి రూ.15,075 కోట్లు కేటాయించింది. ఈ హామీని నెరవేర్చాలంటే రూ.22,612 కోట్లకు పెంచాల్సి ఉంది.

కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎలా?

రైతుల ఇన్‌పుట్ సబ్సిడీని రూ. 10,000 నుంచి రూ. 15,000కి పెంచుతామని, వ్యవసాయ కార్మికులకు ప్రయోజనాలను వర్తింపజేస్తామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడం ఆర్థిక చిక్కులకు దారి తీయనుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) సేవల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు కల్పించాలనే హామీల అమలు సాధ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కమలనాథుల హామీల్లో వెనుకంజ

తెలంగాణలో అధికారం కోసం వెంపర్లాడుతున్న బీజేపీ ఓటర్లకు హామీల విషయంలో వెనుకబడింది. బీజేపీ సన్న, చిన్న కారు రైతులకు రూ.2,500 సబ్బిడీ ఇస్తామని ప్రకటించింది. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివే అమ్మాయిలకు ల్యాప్ టాప్ లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. నవజాత ఆడ శిశువులకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడానికి రూ.6వేల కోట్లు, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచడానికి రూ.400 కోట్లు అవసరం అవుతాయి. పేద కుటుంబాలకు బీమా పథకాన్ని అమలు చేయడానికి రూ.2,100 కోట్లు కావాలి.

Also Read: భూకబ్జాదారు రేవంత్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు : సీఎం కేసీఆర్

అధ్యయనం చేశాకే హామీలిచ్చాం : బి వినోద్ కుమార్, బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధ్యయనం చేశాకే హామీలు ఇచ్చామని బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ చెప్పారు. సంక్షేమ పథకాలను ఉచితాలుగా లెక్కించడం లేదని, వెనుకబడిన తరగతుల ప్రగతికి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేయటం లేదని ఆయన వివరించారు. సాగునీరు, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ ఉత్పత్తి కోసం అప్పులు చేశామని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు