కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా నగరాలు ఖాళీ అవుతున్నాయి. లాక్‌డౌన్ దెబ్బకు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు వలస కార్మికులు.. దీంతో చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాలు ఖాళీ అవగా.. హైదరాబాద్‌లో మాత్రం వలసకూలీలు తిరిగి వస్తున్నారు. హైదరాబాద్‌లో కరోనా రోజురోజుకు తగ్గుతుండడం.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా వలసకూలీలు నగరం బాట పట్టారు.
తొలి విడతగా బీహార్ నుండి 225 మంది వలస కూలీలు హైదరాబాద్‌కు రాగా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలను కూడా తిరిగి హైదరాబాద్ తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుంచి కూలీలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైలులో లింగంపల్లి స్టేషన్‌కు వచ్చారు.
వలస కూలీల రాకను రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. ప్రదానంగా రైస్ మిల్లులలో పనిచేయడానికి వీరంతా వచ్చారని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
ఈ కూలీలను నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల, సిద్దిపేటకు ప్రత్యేక బస్సులలో తరలిస్తున్నారు. వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం వీరిని సంబంధిత జిల్లాలకు తరలిస్తున్నారు. కూలీలకు మంచినీళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, మాస్కులు కూడా అందిస్తుంది ప్రభుత్వం.