ఆ ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసింది: సీఎం రేవంత్‌రెడ్డి

"మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధాన్ని గెలిచిన మనం.. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం" అని అన్నారు.

ఆ ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసింది: సీఎం రేవంత్‌రెడ్డి

Updated On : August 15, 2025 / 11:14 AM IST

తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొని, జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రసంగించారు.

అహింసా పద్ధతిలో మహాసంగ్రామాన్ని గెలిచామని, స్వాతంత్ర్య పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని రేవంత్ రెడ్డి అన్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Also Read: ఈ ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం: సీఎం చంద్రబాబు ప్రసంగం

“ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం.. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం.

మనం సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్యపాలనకు పునాదులు వేసుకున్నాం. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి పండిత్ జవహర్‌ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిపించేలా చేసింది. మన దేశ ప్రజల ఆత్మను ఆవిష్కరించిన నెహ్రూ ప్రసంగాన్ని ఇప్పుడు మరోసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.

అందులోని కొన్ని అంశాలను ఈ సందర్భంగా దేశ ప్రజలతో పంచుకోవాలని నేను భావిస్తున్నాను. నెహ్రూ ఆనాడు దేశ భవిష్యత్తు మనల్ని పిలుస్తుందని అన్నారు. దేశంలోని కర్షకుడు, కార్మికుడు ఇలా అన్ని వర్గాలవారికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు రావాలని చెప్పారు. పేదరిక నిర్మూలన జరగాలి, అసమానతలను రూపుమాపాలి, రోగాలను నివారించాలి, మనది ధనికమైన ప్రజాస్వామ్యయుత ప్రగతిశీల దేశంగా ఉండాలని నెహ్రూ చెప్పారు.

ఇలాంటి స్ఫూర్తి ప్రదాయకమైన మాటలతో ఆనాడు నెహ్రూ భారతదేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేశారు. కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు. ఆ దిశగా కార్యాచరణ తీసుకొని దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశారు. దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా భారత్‌ను నిలబెట్టడంలో గొప్ప రాచనీతిజ్ఞత ప్రదర్శించారు.

పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ పారిశ్రామిక వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఆ స్ఫూర్తిని, ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ఈనాడు మేము పరిపాలన కొనసాగిస్తున్నాం” అని తెలిపారు.