GHMC elections SEC Parthasarathy : గ్రేటర్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి నిముషం వరకూ హోరాహోరీ ప్రచారం సాగింది. ఎన్నికల ప్రచారం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. చివరి నిముషం వరకూ ఓటర్ల కరుణ కోసం నేతలు పాట్లు పడ్డారు. రోడ్‌షోలు, పబ్లిక్ మీటింగ్‌లతో హోరెత్తించారు. జీహెచ్‌ఎంసీ బరిలో 1,122 మంది అభ్యర్థులు నిలిచారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు.
గ్రేటర్ లో మొత్తం వార్డులు 150 ఉన్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74,04,286 ఓటర్లు ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106 డివిజన్లలో పోటీ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎంఐఎం 51, సీసీఐ 17, సీపీఎం 12, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది పోటీ చేస్తున్నారని వివరించారు.
డిసెంబర్1న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగనుందని చెప్పారు. 4వ తేదీన కౌంటింగ్ జరుగనుందని పేర్కొన్నారు. కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించనున్నట్లు పార్థసారథి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం 28,683 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలింగ్ విధుల్లో 45 వేల సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. గ్రేటర్‌లో అతి చిన్న డివిజన్ ఆర్సీ పురం అన్నారు. పోలింగ్ కోసం 9101 కేంద్రాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 532, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 308, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1004 ఉన్నాయని పార్థసారథి వివరించారు.
గ్రేటర్ఎన్నికల కోసం పోలింగ్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని పార్థసారధి పేర్కొన్నారు. కరోనా వైరస్నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని…ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
పోలింగ్ బూత్ ప్రవేశద్వారంలో శానిటైజర్ ఏర్పాటు చేశామని.. ఓటు వేసేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. మరోవైపు పోలింగ్ సిబ్బందికి కరోనా కిట్లు అందించినట్లు ఆయన తెలిపారు. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కు విలువను గుర్తుంచుకుని..ఓటు హక్కును వినియోగించుకోవాలని పార్థసారధి విజ్ఞప్తి చేశారు.