సౌదీ ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి: సీపీ సజ్జనార్
సౌదీలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు.
Saudi Accident
Saudi Accident: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు సజీవదహనమయ్యారు. మదీనాకు సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని సీపీ సజ్జనార్ తెలిపారు. యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో 45 మంది హైదరాబాదీలు మృతిచెందారని వివరించారు.
మొత్తం 54 మంది నవంబరు 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లారని చెప్పారు. వారిలోని నలుగురు నిన్న కారులో మదీనాకు వెళ్లారని, మరో నలుగురు మక్కాలోనే ఉన్నారని తెలిపారు. మిగిలిన 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయల్దేరినప్పుడు ప్రమాదం జరిగిందన్నారు. వీరిలో అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. మృతులు మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాలకు చెందిన వారని సమాచారం.
మెహిదీపట్నం ఫ్లై జోన్ ఏజెన్సీ ద్వారా 54 మంది టికెట్లు బుక్ చేసుకుని ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఈ నెల 9 తేదీన హైదరాబాద్ నుంచి ఉమ్రాకు వెళ్లారు. మక్కాయాత్రను పూర్తిచేసుకుని మదీనా వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తనకు తెలిసిందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సౌదీలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు. భారత విదేశాంగ మంత్రితో మాట్లాడానని అసదుద్దీన్ తెలిపారు. మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని అన్నారు.
మృతులు పేర్లు: రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీ. మిగతా వారి పేర్లు తెలియాల్సి ఉంది. (Saudi Accident)
