300 stray dogs
300 Dogs Killed : రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 300 వీధి కుక్కలను చంపిన ఘటనలో ఇద్దరు గ్రామ సర్పంచ్ లతోపాటు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో మూడు రోజుల వ్యవధిలో 300 వీధి కుక్కలను చంపి.. వాటిని ఊరి బయట పాతిపెట్టినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : CM Revanth Reddy : గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వివాహానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం
జనవరి 9న జంతు సంక్షేమ కార్యకర్తలు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. జనవరి 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ మధ్య శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపారని ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇద్దరు వ్యక్తులను నియమించుకుని కుక్కలకు విషం ఇచ్చి, తరువాత వాటి కళేబరాలను గ్రామాల శివార్లలో పడేశారని జంతు సంక్షేమ కార్యకర్తలు ఆరోపించారు. వారి ఫిర్యాదు ఆధారంగా శాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధికుక్కలను హతమార్చి పాతిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేశారు. జంతవులుపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 కింద కేసు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో శాయంపేట, ఆరెపల్లి సర్పంచ్ లు, వారి భర్తలు, ఒక ఉపసర్పంచ్, ఇద్దరు గ్రామ కార్యదర్శులు, ఇద్దరు రోజువారి కూలీలు ఉన్నారు.
ఇప్పటికే 120కిపైగా పాతిపెట్టిన వీధి కుక్కల కళేబరాలను పోలీసులు, వెటర్నరీ సిబ్బంది వెలికి తీయించారు. మరోవైపు వీధి కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు శాంపిల్స్ సేకరించారు. దీనిపై పూర్తి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.