కరోనాను జయించారు ఆ చిన్నారులు. 13 మంది చిన్నారులు వైరస్ ను తరిమికొట్టి పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారు. ఇక్కడ విశేషం ఏమిటంటే..ఇందులో 21 రోజుల పసికందు ఉన్నాడు. ఈ బుడతడికి కరోన వైరస్ సోకినప్పుడు అయ్యో…ఎలా..తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన వాడు..పాపం అనుకున్నారు.
కరోనాను ఎదుర్కొంటాడా ? అని తల్లిదండ్రులతో పాటు అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ గాంధీ ఆసుపత్రి వైద్యుల చికిత్స, నిబంధనలు చిన్నారులతో పాటు ఆ చిట్టితల్లిని కాపాడాయి. అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లిపోయారు. వెళ్లేముందు అందరూ గాంధీ ఆసుపత్రి వైద్యులను కొనియాడారు. హాట్సాఫ్ డాక్టర్స్ అంటూ చేతులెత్తి దండం పెట్టారు. కరోనా సోకిన అత్యంత చిన్న వయస్కున్న బాబుకు సమర్థవంతంగా చికిత్స అందించిన..గాంధీ వైద్యులను మంత్రి ఈటెల రాజేందర్ అభినందించారు.
ఢిల్లీ నుంచి వచ్చిన మహబూబ్ నగర్ వాసికి కరోనా లక్షణాలు సోకడంతో 2020, ఏప్రిల్ 10వ తేదీన అతని బిడ్డ నుంచి శాంపిళ్లు సేకరించారు. అప్పటికే ఆ పసికందుకు అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. చివరకు కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఆ 25 రోజుల పసికందును గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రత్యేకంగా చికిత్స అందించారు. చిన్న పిల్లల డాక్టర్లు నిరంతరం పర్యవేక్షించారు. జ్వరం, విరేచనాలు తగ్గి..క్రమేపి ఆరోగ్యం మెరుగుపడింది.
ఈ పసికందుతో పాటు..మరో 12 మంది పిల్లలు కరోనా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో హైదరాబాద్ తో వివిధ జిల్లాలకు చెందిన వారున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం బాగా ఉండడంతో ఇంటికి పంపించారు. వీరందరూ గాంధీ ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.