తెలంగాణలో కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి

  • Publish Date - June 8, 2020 / 06:14 PM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో కొత్తగా 92 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనా సోకి ఐదుగురు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3,742 కి చేరింది. ఇప్పటివరకు 142 మంది వైరస్ సోకి మృతి చెందారు. 1742 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 1866 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. 

సోమవారం (జూన్ 8, 2020) కరోనా పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనాపై ఆందోళన అవసరం లేదని… అంతా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. కరోనా సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం కరోనా బారిన పడి సీరియస్ ఉన్నవారికి ఆస్పత్రుల్లో.. లక్షణాలు లేని వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 

2 వేల మందికి చికిత్స అందించే సామర్థ్యం గాంధీ ఆస్పత్రికి ఉందన్నారు. ఇప్పుడు 247 మంది కరోనా పేషంట్లు మాత్రమే గాంధీ ఆస్పత్రిలో ఉన్నారని వెల్లడించారు. గాంధీలో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు వెయ్యి ఉన్నాయని వెల్లడించారు. గాంధీలో కరోనా రోగులతో కిక్కిరిసిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

కరోనా వైరస్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తప్పుడు ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వాస్పత్రులకు ఉందని పేర్కొన్నారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించడానికి.. అన్ని రకాల సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.