Balakrishna: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన గొప్ప మనసు చాటుకున్నారు. కామారెడ్డిలో వరద బాధితులకు అండగా నిలిచారు. వరద బాధితుల సహాయార్ధం 50 లక్షలు విరాళం ప్రకటించారు బాలయ్య. ఈ మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. ముందు ముందు కూడా తన వంత సహాయక చర్యలు అందిస్తానని బాలక్రిష్ణ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో బాలకృష్ణ ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును బాలయ్య అందుకున్నారు.
”నేను చేసే ఈ సాయం రైతులకు ఉపయోగపడాలి. వారి కన్నీళ్లను ఎవరూ తుడవలేరు. నా వంతుగా ఈ సాయం చేస్తున్నా” అని బాలయ్య అన్నారు. ఎన్నడూ లేనంతగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలిసి చాలా బాధ కలిగిందన్నారు.
భారీ వర్షాలు తెలంగాణలో బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో భారీ విధ్వంసమే జరిగింది. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పట్టణాలు, గ్రామాలపైకి వరద పోటెత్తింది. ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో అపారమైన నష్టం వాటిల్లింది. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు.
వరద బాధితుల కష్టాల గురించి తెలిసి బాలకృష్ణ చలించిపోయారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.
బాలకృష్ణ హీరోగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఇందులో భాగంగా బాలయ్యకు సన్మానం నిర్వహించారు.
Also Read: అత్తమ్మ చేసిన మంచి పని గురించి చెప్పిన చిరంజీవి.. మరణించిన తర్వాత.. అల్లు అర్జున్ నానమ్మ గ్రేట్..