Telangana Assembly election 2023 : అగ్రనేతల రోడ్ షోలకు అడ్డా కూలీలు…ఒక్కొక్కరికి కూలీగా రూ.500 చెల్లింపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో అడ్డాకూలీలకు సులభంగా ఉపాధి లభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చౌరస్తాల్లో రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించేందుకు వందలాది అడ్డాలున్నాయి....

Adda coolies

Telangana Assembly election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో అడ్డాకూలీలకు సులభంగా ఉపాధి లభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చౌరస్తాల్లో రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించేందుకు వందలాది అడ్డాలున్నాయి. భవన నిర్మాణ పనులతో పాటు పలు ఇంటి పనుల కోసం కూలీలను తీసుకువెళ్లేందుకు యజమానులు అడ్డాలకు వస్తుండటం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిత్యకృత్యంగా మారింది. కూలీ పనుల కోసం పిలిచేందుకు భవన నిర్మాణ యజమానులు వచ్చినా లేబర్ అడ్డాల్లో కూలీలే దొరకడం లేదు.

పెయిడ్ అడ్డా కూలీలు

ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన అగ్రనేతలు తరచూ గ్రేటర్ హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. ఈ సభలు, రోడ్ షోలకు అడ్డా కూలీలకు డబ్బులిచ్చి తరలిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు అసెంబ్లీ నియోజకవర్గాలు అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అడ్డాకూలీలు ఉదయం ఒక రాజకీయ పార్టీ సభకు, సాయంత్రం మరో రాజకీయ పార్టీ రోడ్ షోకు వెళుతున్నారు.

ALSO READ : Molestation : దారుణం.. అమ్మాయిలను రూమ్‌లోకి పిలిచి స్కూల్ ప్రిన్సిపల్ వికృత చేష్టలు, బాధితుల్లో 142మంది ఆడపిల్లలు

ఇలా ఉదయం, సాయంత్రం వేర్వేరుగా రాజకీయ పార్టీలు అడ్డా కూలీలను తరలిస్తుండటంతో వారికి రెండు పూటలా డబ్బు, తినడానికి బిర్యానీ ప్యాకెట్, తాగడానికి క్వార్టర్ బాటిల్ దొరుకుతున్నాయి. దీంతో అడ్డాకూలీలు పనిచేయకుండానే రెండు పూటలా రాజకీయ పార్టీల సభలు, రోడ్ షోలకు వెళుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ నగరంలో పలు భవన నిర్మాణ పనులు నిలిచాయి. ఈ ఎన్నికలు పుణ్యమా అంటూ తమ భవన నిర్మాణాలకు కూలీలు దొరకడం లేదని ఓ బిల్డర్ ఆవేదనగా చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు, రోడ్ షోలలోనూ అడ్డా కూలీలే మద్ధతుదారులుగా కనిపిస్తున్నారు.

బస్తీలు, మురికివాడలు, గల్లీలే లక్ష్యంగా జనాల తరలింపు

ఏ రాజకీయ పార్టీ అగ్ర నేత బహిరంగసభ జరిగినా, రోడ్ షో జరిగినా ఇలా పెయిడ్ అడ్డా కూలీలనే సమీకరించాల్సి వస్తోంది. వివిధ రాజకీయ పార్టీల గల్లీ లీడర్లు గ్రేటర్ పరిధిలోని బస్తీలు, మురికివాడలు, గల్లీల్లోని మహిళలకు సైతం డబ్బు పంపిణీ చేసి వారిని సభలు, రోడ్ షోలకు తీసుకువెళ్లి తమ బల ప్రదర్శన చేస్తున్నారు. ఎవరికి వారు తమ బలం బాగుందని పెయిడ్ అడ్డాకూలీలతో ప్రదర్శిస్తున్నారు. కానీ వాస్తవంగా ఓటర్లు మాత్రం సభలు, రోడ్ షోలకు దూరంగా ఉంటున్నారు.

ALSO READ : Mumbai Airport :ముంబయి విమానాశ్రయాన్ని 48 గంటల్లో పేల్చివేస్తాం…ఈమెయిల్ బెదిరింపు

ఇలా కూలీపై అన్ని పార్టీల సభలు, రోడ్ షోలకు వెళుతున్న అడ్డా కూలీలు ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తారనేది అంతుపట్టడం లేదు. ఏ రాజకీయ పార్టీ డబ్బులిస్తే ఆ పార్టీ కండువాను అడ్డాకూలీలు మెడలో వేసుకొని తిరిగి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇలా ఒక్కో అడ్డా కార్మికుడు మూడు రాజకీయ పార్టీల కండువాలు మారుస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తెలంగాణ రాజకీయ ప్రచార పర్వంలో అడ్డాకూలీల పాత్ర కీలకంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు