Addanki Dayakar : నా జీవితంలో మర్చిపోలేని అవకాశం, కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం జరుగుతుంది- అద్దంకి దయాకర్

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం.

Addanki Dayakar : కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్. అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. నా జీవితంలో మర్చిపోలేని అవకాశం ఇది అని అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారాయన.

”తల్లి తెలంగాణ అంటే సోనియమ్మ. మా ఇద్దరు ఉద్యమకారులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న శంకర్ నాయక్ కి సామాజిక న్యాయం పాటిస్తూ సోనియా గాంధీ అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆశీస్సులతో మాకు ఈ అవకాశం దక్కింది. మేము ప్రజాస్వామ్యవాదులం. సామాజిక న్యాయం కోసం పోరాడిన వాళ్లం. కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇచ్చింది.

Also Read : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ సోదాలు.. పెద్దమొత్తంలో అక్రమ లావాదేవీలు? ట్యాక్స్ కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్..!

మార్చి 10 మిలియన్ మార్చ్ జరిగిన రోజు. మొట్టమొదటి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రోజు. ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇవాళ తెలంగాణకు సేవ చేయమని మమ్మల్ని పంపించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇవాళ తెలంగాణ ఒక్కటే కాదు రెండు తెలుగు రాష్ట్రాలు సంతోషపడుతున్న ఎన్నిక ఇది. మా జీవితంలో మర్చిపోలేని అవకాశం ఇది.

తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇంతకంటే పెద్ద తార్కాణం అక్కర్లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధిష్టానానికి, ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం జరుగుతుంది, అందుకే ఉద్యమకారులైన నాకు, విజయశాంతికి అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ అయ్యాక మండలిలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం”అని అద్దంకి దయాకర్ అన్నారు.

Also Read : గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి..

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురికి అవకాశం దక్కగా.. మరొకటి మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా.. నాలుగు స్థానాలు రానున్నాయి. ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. మిగతా ముగ్గరు అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం.. చివరికి పేర్లు ప్రకటించింది. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ కు అవకాశం ఇచ్చింది.