Sri Chaitanya Institutions : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ సోదాలు.. పెద్దమొత్తంలో అక్రమ లావాదేవీలు? ట్యాక్స్ కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్..!
మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Sri Chaitanya Institutions : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణ, ఏపీతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు చేసిన ఐటీ అధికారులు.. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.
విద్యార్థుల నుంచి ఫీజు నగదు రూపంలో తీసుకొని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫీజుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ తయారు చేసుకుని లావాదేవీలు జరుపుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ అధికారులు కనుగొన్నారు. ఆదాయపు పన్ను అవకతవకలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Also Read : గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి..
అక్రమ లావాదేవీలు జరపడంతో పాటు పన్ను ఎగవేశారనే ప్రధాన అభియోగాలతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా చైతన్య కళాశాలలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలతో పాటు కొన్ని బ్రాంచుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు ప్రధాన కారణం.. విద్యార్థుల నుంచి ఫీజులు నేరుగా డబ్బుల రూపంలో తీసుకుని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున చైతన్య విద్యాసంస్థలపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చాయి. ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించుకుని వాటి ద్వారా విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఫీజులు కట్టించుకోవడం జరిగింది. ఐటీ శాఖ దృష్టిలో పడకుండా కొత్త కొత్త సాఫ్ట్ వేర్ లను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
Also Read : సమయం లేదు మిత్రమా.. ఈ ఉద్యోగాలకు తుది గడువు ముగుస్తోంది.. వివరాలు చూడండి
ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ లావాదేవీలు, ఫీజులు..వీటన్నింటికి సంబంధించి కీలక డాక్యమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను ఐటీ శాఖ అధికారులను సీజ్ చేసినట్లు సమాచారం. సోదాలన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించి ఐటీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.