Pregnant woman commits suicide in Jagadgirigutta : అదనపుకట్నం వేధింపులకు హైదరాబాద్‌లో ఓ గర్భిణి బలైపోయింది. చివరికి శ్రీమంతానికి పుట్టింటికి వెళ్లడానికి కూడా బంగారం డిమాండ్ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. పుట్టింటికి వెళ్లడానికి ఐదు తులాల బంగారం ఇవ్వాలా అని ఐదు నెలల గర్భిణి కృష్ణప్రియ తీవ్ర మనోవేదనకు గురైంది. బంగారం ఇస్తేనే శ్రీమంతానికి పంపుతామని బెట్టుచేయడంతో… ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కృష్ణప్రియ, జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్‌కు చెందిన శ్రవణ్‌కుమార్‌తో వివాహమైంది. ఇద్దరూ దూరపు బంధువులు కావడంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. శ్రవణ్‌కుమార్ జిమ్ నిర్వహిస్తున్నాడు. కృష్ణ ప్రియ ఇంట్లోనే ఉంటోంది. ప్రస్తుతం కృష్ణప్రియ ఐదు నెలల గర్భిణి.
అయితే శ్రీమంతం కోసం పుట్టింటికి వెళ్లడానికి కృష్ణప్రియ సిద్ధమవ్వగా… అందుకు భర్త నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఐదు తులాల బంగారం ఇస్తేనే శ్రీమంతం చేసుకోవడానికి పుట్టింటికి పంపుతానని.. లేకుంటే పంపబోనని తేల్చిచెప్పినట్టుగా ప్రచారం నడుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గర్భిణి కృష్ణప్రియ ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. దీంతో జగద్గిగిగుట్టలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న కృష్ణ ప్రియ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తెను అత్తింటివాళ్లే చంపారని ఆరోపిస్తున్నారు. అదనపుకట్నం కోసం తమ కుమార్తెను వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని కృష్ణప్రియ తల్లి ఆరోపిస్తోంది. పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది.
తమ కూతురు పెళ్లిలో వరకట్నం కింద ఐదులక్షలు అప్పజెప్పామని మృతురాలి తల్లి చెబుతోంది. మరో 12 లక్షల కట్నం కోసం డిమాండ్ చేశారని.. ఆరోపిస్తోంది. చివరికి శ్రీమంతానికి పుట్టింటికి పంపడానికి కూడా ఐదు తులాల బంగారం డిమాండ్ చేశారని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.