ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభవార్త.. డబ్బు ఆదా చేసుకోవచ్చు..

సాండ్ బజార్‌లను ఎందుకు ఏర్పాటు చేశారు? సాండ్ బజార్‌ లక్ష్యాలు ఇవే..

Indiramma Indlu

Indiramma Indlu: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులు మరింత డబ్బును ఆదా చేసుకునే అవకాశం లభిస్తోంది. నాణ్యమైన ఇసుకను తక్కువ ధరకే అందించేందుకు వరుసగా సాండ్ బజార్‌లను ప్రారంభిస్తోంది.

ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ సంగుపేట-జోగిపేట జంక్షన్‌లో సాండ్ బజార్‌ను ప్రారంభించారు. తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో ఇది ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సాండ్‌ బజార్‌కు సంబంధించిన వివరాలు తెలిపారు. ప్రభుత్వం నాణ్యమైన ఇసుకను తక్కువ ధరలకు మధ్యవర్తులు లేకుండా అందించడమే లక్ష్యమని తెలిపారు.

ప్రతి జిల్లా 20 కి.మీ. పరిధిలో ఒక సాండ్ బజార్‌ను ఏర్పాటు చేస్తామని, ఇందిరమ్మ గృహ నిర్మాణ అవసరాలు సహా స్థానిక అవసరాలను తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. (Indiramma Indlu)

Also Read: రోహిత్ శర్మను వెళ్లగొట్టడానికే అంత కఠినమైన ఫిట్‌నెస్ టెస్ట్.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలనం

సంగారెడ్డి ప్రాంతంలో సహజ ఇసుక రీచులు లేవు కాబట్టి సాండ్ బజార్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. అక్రమ వాణిజ్యాన్ని అరికట్టడానికి ఆన్‌లైన్ పర్యవేక్షణ ద్వారా ఇసుక అమ్మకాలను గమనిస్తామని చెప్పారు.

సాండ్ బజార్‌లను ఎందుకు ఏర్పాటు చేశారు?

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సాండ్ బజార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు.

సాండ్ బజార్‌ లక్ష్యాలు ఇవే..

దామోదర రాజనర్సింహ తెలిపిన వివరాల ప్రకారం..

  • ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నేరుగా ఇసుక అందుబాటులోకి తేవడం
  • ఇసుక మార్కెట్ ద్వారా నాణ్య‌మైన ఇసుక పంపిణీ చేడం
  • ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్ధిదారుల‌కు త‌క్కువ ధ‌ర‌లో నాణ్య‌మైన ఇసుక స‌ర‌ఫ‌రా చేయడం
  • దళారుల బెడద లేకుండా చేయడం
  • పారదర్శక పద్ధతిలో నేరుగా ప్రజలకు ఇసుక అందించడం
  • ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో శాండ్ బజార్ ఉండేలా ప్రణాళికలు
  • ప్రజలు తక్కువ దూరంలోనే ఇసుకను సులభంగా పొందడం
  • ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడడం
  • ఇసుక రీచ్‌లు లేని ప్రాంతాల్లో పథక లబ్ధిదారులకు సమస్యలు లేకుండా చూడడం
  • ఇసుక కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం
  • సాండ్ బజార్‌ ఇందిరమ్మ లబ్ధిదారులకు టన్ను ఇసుక‌కు రూ.1200
  • ఇతరులకు రూ.1800కి
  • బయట మార్కెట్ కంటే రూ.1000 తక్కువ ధరకే లభ్యం