CM KCR meeting : చాలా కాలం తర్వాత.. గులాబీ దళపతి కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. నేడు జరగబోయే.. ఈ మీటింగ్‌పై అంతటా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులపై.. హైదరాబాద్ మేయర్ పీఠం ఎలా దక్కించుకోవాలన్నదానిపై.. కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ భవిష్యత్ ప్రణాళికలపై నేతలకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు గులాబీ బాస్.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ పరిణామాలపై.. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతోంది. కొన్ని నెలల గ్యాప్ తర్వాత జరుగుతున్న ఈ సమావేశం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మీటింగ్‌లో.. పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు వెల్లడిస్తారోనని.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పార్టీ సంస్థాగత నిర్మాణమే.. సమావేశం ప్రధాన ఎజెండా అని చెబుతున్నప్పటికీ.. ఈ ఒక్క మీటింగ్‌లోనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది.
సభ్యత్వ నమోదు : –
రెండేళ్లకొకసారి పార్టీ నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని.. ఈసారి ఎప్పటి నుంచి నిర్వహించాలన్న దానిపై.. కేసీఆర్ సమావేశంలో తెలియజేయనున్నారు. గతంలో.. దాదాపు 60 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఉంది. ఈసారి అంతకంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలన్న లక్ష్యంతో.. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు. పార్టీ ప్లీనరీ నాటికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక కూడా పూర్తి కావాల్సి ఉంది. అందుకనుగుణంగా.. గులాబీ దళపతి కేసీఆర్ షెడ్యూల్‌ని ప్రకటించనున్నారు. ఈ నెల 15 నుంచి.. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నెలరోజుల పాటు సభ్యత్వ నమోదు తర్వాత కమిటీలను నియమించే అవకాశం ఉంది.
పొలిటికల్ గా స్పష్టత : –
ఇవన్నీ పక్కనబెడితే.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో అనుకూలమైన ఫలితాలు దక్కడం లేదు. దీనిని అధిగమించేందుకు.. అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో.. బీజేపీ దూకుడుకు బ్రేక్ వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ దృష్టిసారించే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కేసీఆర్ కలిశారు. ఆ తర్వాత.. ఆయన కాస్త మెత్తబడ్డారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ సమావేశం ద్వారా.. పొలిటికల్‌గా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కేటీఆర్ సీఎం : –
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ త్వరలో సీఎం కాబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశంలో.. పార్టీ నాయకులకు కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. తక్కువ సంఖ్యలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. వీటి విషయంలోనూ సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈసారి.. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ బైపోల్‌లో సత్తా చాటేందుకు.. ఆ జిల్లాల నేతలకు ప్రత్యేకంగా సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు.