Akbaruddin Owaisi: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తెలంగాణలో తమ పార్టీ మరింతగా బలపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారయన. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయనతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో 50 నియోజకవర్గాల్లో నిజంగా పోటీ చేస్తారా అని శ్రీధర్ బాబు అడగ్గా.. కచ్చితంగా పోటీ చేస్తామని అక్బరుద్దీన్ తెలిపారు. తమ పార్టీని బీజేపీ బీ టీమ్ అని ప్రచారం చేస్తున్నారని, తాము మాత్రం ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ చేసే అరాచకాలు పెరిగిపోతున్నాయని, ఓటు బ్యాంకును బీజేపీ పూర్తిగా పొలరైజ్ చేస్తోందని వ్యాఖ్యానించారు. తమ వర్గానికి అండగా ఉంటామని అక్బరుద్దీన్ వెల్లడించారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ఇలా అయితే మీరు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. మీ వర్గానికి అంటే.. బీజేపీ ఎజెండా కూడా అదే కదా అని అడిగారు. ఎవరు ఏమనుకున్నా.. వచ్చే ఎన్నికల్లో తాము మాత్రం కచ్చితంగా తమ పార్టీని విస్తరిస్తామని అక్బరుద్దీన్ సమాధానం ఇచ్చారు. కాగా, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం పార్టీకి గంట టైమ్ కేటాయించడం పట్ల మంత్రి కేటీఆర్ శనివారం శాసనసభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అక్బరుద్దీన్ స్పందిస్తూ.. రానున్న ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో పోటీ చేసి, కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తామని కౌంటర్ ఇచ్చారు.
Also Read: Telangana Budget 2023: ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్..