Telangana Budget 2023: ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ .. బడ్జెట్‌లో రూ. 7,890 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పలు రంగాలవారికి శుభవార్తలు చెప్పారు. ఈ కోవలోనే రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు.

Minister Harish Rao
Telangana Budget 2023: ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సోమవారం అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను సభ ముందు ఉంచారు. సుమారు రెండు గంటల పాటు బడ్జెట్ పై ఆయా రంగాలకు కేటాయింపుల వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనుకున్నట్లుగానే సంక్షేమానికి, ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట వేశారు.
పలు రంగాల వారికి మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో శుభవార్తలు వినిపించారు. ఈ కోవలోనే రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇల్లులేని నిరుపేదలు సొంతజాగా కలిగి ఉంటే అందులో ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షలు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఆ పథకం ఇప్పటికి కార్యరూపం దాల్చలేదు. ఈ పథకం అమలైతే ఇంటి నిర్మాణం చేపట్టేందుకు అనేకమంది పేదలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సొంతజాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన హరీష్, అందుకోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు.
ప్రతీ నియోజకవర్గంలో 2వేల మందికి సొంతస్థలంలో ఇంటి నిర్మాణం చేసుకొనే వారికి రూ. 3లక్షల చొప్పున సాయం అందిస్తామని మంత్రి తెలిపారు. అంతేకాక సీఎం కోటాలో 25వేల మందికి రూ. 3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దీంతో మొత్తంగా 2 లక్షల 63 వేల మందికి లబ్ధిచేకూరుతుందని తెలిపారు ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 7,890 కోట్లు కేటాయించారు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం బడ్జెట్ లో రూ.12వేల కోట్లు కేటాయించారు.