Cab Drivers Strike : నగర వాసులకు అలర్ట్.. క్యాబ్ డ్రైవర్ల బ్రేక్‌డౌన్ సమ్మె.. నేడు ఈ సమయాల్లో సర్వీస్సులు బంద్
Cab Drivers Strike : నగరవాసులకు అలర్ట్.. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రముఖ యాప్ ఆధారిత రవాణా సేవల డ్రైవర్లు నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.
Cab Drivers Strike
- నేడు క్యాబ్ డ్రైవర్ల బ్రేక్‌డౌన్ సమ్మె
- ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సర్వీసులు బంద్
- గిగ్ వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రేటు నిర్ణయించాలి
- కంపెనీల దోపిడీని అరికట్టాలని డిమాండ్
Cab Drivers Strike : నగరవాసులకు అలర్ట్.. నగర ప్రాంతాల్లోని చాలామంది తమతమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్, మోటార్ సైకిల్ సర్వీసులను వినియోగిస్తుంటారు. అయితే, ఇవాళ వారికి కష్టాలు తప్పేలా లేవు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రముఖ యాప్ ఆధారిత రవాణా సేవల డ్రైవర్లు నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్ నగరంతోపాటు పలు ప్రాతాల్లో వీటి సేవలు నిలిచిపోనున్నాయి.
యాప్ ఆధారంగా నడిపే ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లు శనివారం నిరసన చేపట్టడం జరుగుతుందని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూ) ప్రకటించింది. ర్యాపిడో, ఉబర్, ఓలాతోపాటు ఆటోలు, గూడ్స్ వాహనాలు, పోర్టర్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సేవలను ఎక్కడికక్కడ నిలిపి వేయనున్నారు.
దేశ వ్యాప్తంగా జరిగే ఈ నిరసనలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేయనున్నారు. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు షేక్ సులావుద్దీన్ వెల్లడించారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రేటు నిర్ణయించి కంపెనీల దోపిడీని అరికట్టాలని కోరారు.
డిమాండ్లు ఇవే..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 ప్రకారం.. కనీస ప్రాథమిక చార్జీలను వెంటనే నోటిఫై చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలు ఇష్టానుసారంగా చార్జీలను నిర్ణయిస్తూ డ్రైవర్ల ఆదాయానికి గండి కొడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. వ్యక్తిగత అవసరాలకోసం వాడే వైట్ బోర్డు వాహనాలను కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడటాన్ని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల టాక్సీ పర్మిట్ ఉన్న డ్రైవర్ల ఉపాధి దెబ్బతినడమే కాకుండా.. ప్రయాణికుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని వారు వాదిస్తున్నారు. మరోవైపు.. కంపెనీలు ఒక్కో రైడ్‌పై 25 నుంచి 30శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయని, పెరుగుతున్న ఇంధన ధరలతో పోలిస్తే డ్రైవర్లకు దక్కే నికర ఆదాయం నెలకు రూ.15వేలు కూడా దాటడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఆటో, క్యాబ్, ట్యాక్సీ, లారీ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంకోసం ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మోటార్ కార్మికుల సంఘాల జేఏసీ ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు అమలుతో ఆటోడ్రైవర్ల ఆదాయంపై తగ్గిందని తెలిపింది. ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలను నియంత్రించాలని కోరింది.
