Allu Arjun
Allu Arjun released from Chanchalguda Jail: సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వెనుక గేటు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ పోలీసు ఎస్కార్ట్ వాహనం ద్వారా తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ ఉన్నారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
మరోవైపు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలు, రూ.50వేల పూచీకత్తును శుక్రవారం రాత్రి జైలు సూపరింటెంటెండ్ అందజేశారు. అయితే, శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందడంతో అల్లు అర్జున్ విడుదల ప్రక్రియ వాయిదా పడింది. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కాగా.. శనివారం ఉదయం జైలు అధికారులు అల్లు అర్జున్ విడుదల ప్రక్రియను పూర్తి చేయగా.. మధ్యంతర బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలు వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడంతో పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మీడియా, అభిమానుల కంట పడకుండా పోలీసులు జైలు వెనుక గేటు ద్వారా అల్లు అర్జున్ ను తన నివాసానికి తీసుకెళ్లారు.