Allu Arjun
Allu Arjun released From Chanchalguda Jail: సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వెనుక గేటు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఎస్కార్ట్ వాహనం ద్వారా గీతాఆర్ట్స్ కార్యాలయంకు వెళ్లారు. అక్కడ సుమారు 45 నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో చర్చించారు. బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదల ఆలస్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు దిష్టితీసి స్వాగతం పలికారు. సతీమణి స్నేహారెడ్డి, ఆయన పిల్లలు అల్లు అర్జున్ ను హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.
Also Read: Chinni Krishna : అల్లు అర్జున్‌కు మరకలు అంటించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు
అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ నేను బాగానే ఉన్నాను.. అభిమానులు ఆందోళన చెందొద్దు. నాకు అండగా నిలిచిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నేను చట్టాన్ని గౌరవిస్తా. చట్టానికి కట్టుబడి ఉంటా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. ఆ కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. వారికి అండగా ఉంటాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నా.. నా సినిమాలే కాదు.. మావయ్య సినిమాలూ చూశా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.’’ అని అల్లూ అర్జున్ అన్నారు.