Telangana BJP : ఆపరేషన్ తెలంగాణ.. అమిత్ షా టూర్‌తో నేతల్లో టెన్షన్.!
Telangana BJP : అభయ్ ఆపరేషన్ నడుస్తుండగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న కరీంనగర్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్నారు అమిత్‌షా.
- Harish Thanniru
- Published on- July 22, 2026 / 11:12 PM IST
Telangana BJP
Telangana BJP : సౌత్‌లో.. తెలంగాణ బీజేపీకి సమ్‌థింగ్ స్పెషల్. పట్టు లేదని కాదు. అలా అని స్టేట్‌లో పవర్‌లోకి రావడం అంత ఈజీ అని కూడా చెప్పలేని పరిస్థితి. 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న బీజేపీ..ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో జెండా పాతేయాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఈ మధ్య తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలనాథులు..ముందుగా గ్రేటర్ ఆపరేషన్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు..స్టేట్ బీజేపీ ప్రోగ్రెస్‌పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ కేంద్ర పార్టీ పెద్దలకు రిపోర్టు పంపించారట. హైకమాండ్ డైరెక్షన్‌లోనే ఈటల రాజేందర్, బండిసంజయ్ మధ్య సయోధ్య మీటింగ్ నిర్వహించిన ఆయన..రాష్ట్ర పార్టీ నేతల పనితీరుపై డిటేయిల్డ్ నివేదిక పంపించినట్లు చెబుతున్నారు.
Also Read : JP Nadda : నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు సిద్ధం.. రాహుల్ గాంధీ ఆరోపణలపై విచారణ జరిపిస్తాం
అభయ్ ఆపరేషన్ నడుస్తుండగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న కరీంనగర్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్నారు అమిత్‌షా. పార్లమెంట్ సెషన్ టైమ్‌లోనే అమిత్ షా రాష్ట్రానికి వస్తుండటంపై చర్చ జరుగుతోంది. ఆయన పాల్గొనేది ప్రైవేటు కార్యక్రమమే అయినా దానికి రాజకీయ ప్రాధాన్యత ఉంటుందనేది రాష్ట్ర నేతల అంచనా. అమిత్ షా గత పర్యటనలను పరిశీలిస్తే ప్రైవేటు కార్యక్రమమైనా, అధికారిక ప్రోగ్రామ్ అయినా..పార్టీ మీటింగ్ పెట్టినా..ఆయన రాష్ట్రానికి వచ్చిన ప్రతీసారి పార్టీ ముఖ్య నేతలతో కొద్దిసేపు చర్చిస్తుంటారు. నేతల పనితీరు, పార్టీ స్థితిగతులపై ఆరా తీస్తారు. కొన్నిసార్లు నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో షాతో జరిగిన మీటింగ్‌లను గుర్తు చేసుకుంటున్న నేతలు..ఇప్పుడు ఆయన తెలంగాణ టూర్‌కు వస్తుండటంతో స్టేట్ బీజేపీ లీడర్లకు టెన్షన్ పుట్టిస్తోందట.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావడానికి ముందే పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, నేతల పనితీరుపై ఆయనకు నివేదికలు చేరుతాయి. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని బీజేపీకి అనుకూలంగా మలుచుకోవడంలో స్టేట్ లీడర్లు విఫలం అవుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ మీదున్న వ్యతిరేకతను బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారకుండా..కార్యకర్తలతో మమేకం అవుతూ ప్రజల్లో ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనలో వివరించారు. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదనేది ఓపెన్ సీక్రెట్. నేతల మధ్య వర్గపోరు కూడా పీక్ లెవల్‌కు చేరింది. ఇటీవల ఈటల, సంజయ్ మధ్య సయోధ్య కుదుర్చినా…ఇంకా చాలా మంది నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో అమిత్ షా తెలంగాణకు వస్తుండటంతో..రాష్ట్ర నేతల్లో కాస్త టెన్షన్ అయితే కనిపిస్తోంది.
అమిత్ షా కరీంనగర్ ప్రోగ్రామ్‌కు వెళ్లే ముందు గాని, ఆ కార్యక్రమం అయిపోయాక గాని రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశయ్యే అవకాశం ఉందట. ఆ మీటింగ్‌లో పార్టీ నేతల పనితీరు, వ్యవహార శైలిపై ఆయన ఆరా తీసే ఛాన్స్ ఉందని స్టేట్ బీజేపీ ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నారట పలువురు నేతలు. అలా అని ఆ సమావేశానికి డుమ్మా కొట్టే అవకాశం కూడా ఉండదు. దీంతో గత ఆరు నెలలుగా రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన పని ఏంటి.? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలేంటి.? ఏ నేత ఏ కార్యక్రమం చేపట్టారో..సొంతంగా చేపట్టిన ప్రోగ్రామ్స్ ఏంటో..రిపోర్ట్ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారట. రాబోయే రెండేళ్ల కార్యాచరణకు కీలక దిశానిర్దేశం చేసేలా..ఈ సారి అమిత్‌షా పర్యటన ఉంటుందని అంటున్నారు.
అమిత్ షా రాక ముందు, వచ్చిన తర్వాత అనే తరహాలో పార్టీ యాక్టివిటీ స్పీడప్ కాబోతుందని నేతలు చెబుతున్నారు. బీజేపీలోనే కాదు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కూడా అమిత్ షా టూర్‌పై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
