JP Nadda : నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధం.. రాహుల్ గాంధీ ఆరోపణలపై విచారణ జరిపిస్తాం
JP Nadda Key Comments On NEET paper leak protests : నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో చర్చిచేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జేపీ అన్నారు.
JP Nadda
JP Nadda Key Comments On NEET paper leak protests : నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో చర్చిచేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జేపీ అన్నారు. అయితే, విద్యార్థుల నిరసనల నుంచి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
నీట్ అంశంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్ గురించి మాకు బాధ్యత ఉంది. విద్యార్థుల నిరసనలను రాజకీయంగా వాడుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో గత పదేళ్లలో 150కిపైగా పేపర్ లీక్ లు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారని.. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా రాహుల్ గాంధీ ఆరోపణలపై విచారణ జరిపి, వాస్తవాలను దేశ ప్రజల ముందు ఉంచుతుందని నడ్డా తెలిపారు. అయితే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పేపర్ లీకులు జరిగాయన్న జేపీ నడ్డా.. తెలంగాణలోనూ ఇంటర్, టెన్త్ పేపర్లు లీక్ అయ్యాయని అన్నారు. కేరళ, తమిళనాడు, బెంగాల్, కర్ణాటకలోనూ పేపర్లు లీక్ అయ్యాయని జేపీ నడ్డా గుర్తు చేశారు.
నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంటులో చర్చకు రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రతిపక్షం కోరినంత కాలం ఈ అంశంపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నేను ఎవరినీ నిందించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మనం చర్చించుకోవాలి. పిల్లలే దేశ భవిష్యత్తు, కాబట్టి ఇది ప్రభుత్వం, ప్రతిపక్షం ఇద్దరి బాధ్యత. శాశ్వత పరిష్కారం కనుగొనడానికి వారు కలిసి పనిచేయాలని జేపీ నడ్డా సూచించారు.
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ, ఎన్డీఏ కూటమి విద్యార్థుల సమస్యపై చాలా శ్రద్ధ వహిస్తున్నాయి. కాబట్టి దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలి. పిల్లలే దేశ భవిష్యత్తు, వారిని సంరక్షించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా తమ బాధ్యతను నెరవేర్చి శాశ్వత పరిష్కారం కనుగొనాలని జేపీ నడ్డా మరోసారి స్పష్టం చేశారు.
