Anchor Shyamala
Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆమెను మూడు గంటల పాటు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడారు.
శ్యామల మాట్లాడుతూ.. ‘‘పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. బెట్టింగ్ యాప్స్ ద్వారా బెట్టింగులు చేయడం తప్పు అని అన్నారు. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అందుకే దానిపై స్పందించలేను. నాకు చట్టాలపై నమ్మకం ఉంది. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయబోను’’ అంటూ శ్యామల చెప్పారు.
Also Read: MLC Election: తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నిక.. షెడ్యూల్ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీలు ఇవే..
బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసు నమోదైంది. వీరిలో టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. అయితే, విష్ణుప్రియ, రీతూచౌదరి ఈనెల 25న మళ్లీ విచారణకు రావాలని పోలీసులు సూచించారు. యాంకర్ శ్యామల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు సూచించింది. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసుల ఎదుట సోమవారం విచారణకు హాజరయ్యారు.