Omicron (1)
Another 12 new Omicron cases in Telangana : ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటాడుతోంది. రాష్ట్రంలో సౌతాఫ్రికా వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలడంతో.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇరవైకి చేరింది. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి.. రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంకా ముగ్గురి శాంపుల్స్ జినోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
అంతకముందు కెన్యా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఒమిక్రాన్ బాధితుడు కనిపించడం లేదంటూ వైద్య శాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. కెన్యాకు చెందిన అబ్దుల్లాహి యారో ఇబ్రహీం (44) ఈ నెల 14న నగరానికి వచ్చాడు. అదే రోజు విమానాశ్రయంలో అతడికి పరీక్షలు నిర్వహించగా.. ఫలితాలు ఈ నెల 16న అతడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. అతడు టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్నట్లుగా తెలుసుకొని అధికారులు అక్కడికి వెళ్లారు.
GHMC Council : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం.. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ
అక్కడ అతడి ఆచూకీ లేకపోవడంతో.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అపోలో ఆస్పత్రి సమీపంలోని ఓ గెస్ట్‌హౌజ్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వైద్యశాఖ సిబ్బంది సాయంతో టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడితోపాటు నూర్ అనే వ్యక్తి ఉండటంతో అతడికి కూడా ఒమిక్రాన్ సోకి ఉంటుందని అనుమానంతో టీమ్స్‌కు తరలించారు.
మరోవైపు రాష్ట్రంలోని కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ పురోగతిపై ఆరా తీశారు. అయితే రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొన్ని దేశాలు ఇప్పటికే ట్రావెల్ బ్యాన్ విధించాయి. భారత్‌కు మాత్రం రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి.