Apex Council : ఏపీతో అమీతుమీ, రైతును కాపాడుకొనేందుకు దేనికైనా రెడీ

  • Publish Date - October 2, 2020 / 06:33 AM IST

Apex Council Meeting : ఏపీతో అమీతుమీకే తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) సిద్ధమయ్యారు. ఆరో తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ (Apex Council Meeting) లో బలంగా వాదనలు వినిపించాలని డిసైడ్ అయ్యారు. వ్యవసాయాన్ని.. రైతులను కాపాడుకునేందుకు దేవునితో ఆయినా కొట్లాటకు సిద్ధమని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం… తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందన్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటి బొట్టును వినియోగించుకుంటామని తేల్చేశారు.



తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో.. దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు కేసీఆర్‌.



ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల విషయంపై ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రగతిభవన్‌ (Pragathi Bhavan) లో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు.



కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పరిష్కారానికి నోచుకోవడం లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం విభజన అనంతరం రాష్ట్రానికి కేటాయించాల్సిన నీటి వాటాను కేంద్రం ఇప్పటికీ కేటాయించకపోవడం కేంద్రం వైఖరిని తెలియజేస్తోందన్నారు.



తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేయలేదని, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులని రీ డిజైన్‌తో మార్పులు చేసి నీటి వినియోగాన్ని చేపడుతున్నామన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందనే విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీ జలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు.



ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టులపై వివాదాలు చోటు చేసుకొన్నాయి. పరస్పరం రెండు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదులు చేసుకొన్నాయి. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ అభ్యంతరం తెలపగా.. తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఏపీ ఫిర్యాదు చేసింది.



ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ఏపీ ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరం చెబుతూనే.. ఏపీ లేవనెత్తిన తెలంగాణ ప్రాజెక్టులపై ధీటుగా సమాధానం ఇవ్వాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు.