Site icon 10TV Telugu

Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై సభలో చర్చ..

Telangana Assembly Session

Assembly Session: రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ శాసనసభ మొదలు కానుంది. 9 గంటల నుండి 9.30 వరకు అసెంబ్లీలో ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం విచారణ కమిషన్ రిపోర్ట్ ను సభలో పెట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 9.30 గంటలకు అసెంబ్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లనున్నారు.

అక్కడి నుంచి కేరళకు బయలుదేరుతారు. ఉదయం 10.30 గంటలకు కేరళలో కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తిరిగి సాయంత్రం 3.40 గంటలకు మళ్లీ అసెంబ్లీ చేరుకోనున్నారు సీఎం రేవంత్.

కాగా, బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఎరువుల కొరత, వరదలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టగా.. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఇందుకు నిరసనగా బీఏసీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై రేపు సభలో చర్చ ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును సభలో పెడతామన్నారు. బీఆర్ఎస్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అన్నది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

అన్ని అంశాలపై చర్చ చేయాలంటే నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చి సభ నడుపుతామన్నారు. గణేష్ నిమజ్జనం, వరదల నేపథ్యంలో మధ్య లో బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యామన్నారు.

రేపు ఉదయం 9 గంటలకు కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 665 పేజీల నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నివేదిక కాపీలను మంత్రులకు అందజేసింది ప్రభుత్వం. సభలో నివేదిక ప్రవేశ పెట్టగానే.. కాపీలను సభ్యులకు అందజేయనుంది సర్కార్.

Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్..!

 

Exit mobile version