మరి కేసీఆర్ కట్టిన సచివాలయంలో రేవంత్ రెడ్డి ఎలా కూర్చుంటున్నారు?: బాల్క సుమన్

Balka Suman: సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ సర్కారు అలంకరణ చేయించలేదని..

కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్‌ను అవమానించిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఇవాళ బాల్క సుమన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… హైదరాబాద్‌లోని సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ సర్కారు అలంకరణ చేయించలేదని, పూలమాల వేయలేదని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఇంత అహంకారం ఎందుకని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఆ అతిపెద్ద విగ్రహాన్ని కేసీఆర్ పెట్టారనే అక్కడ ఏర్పాట్లు చేయలేదా అని నిలదీశారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని అన్నారు. మరి కేసీఆర్ కట్టిన సచివాలయంలో రేవంత్ రెడ్డి ఎలా కూర్చుంటున్నారని ప్రశ్నించారు. సచివాలయానికి కేసీఆర్.. అంబేద్కర్ పేరును పెట్టారని చెప్పారు.

రాష్ట్రంలో కేసీఆర్ గుర్తులను చేరిపివేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. దళిత సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని అన్నారు. కాగా, ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ పాలన దుర్మార్గంగా ఉందని అన్నారు.

మోదీతో ఎవరైనా కలవకపోతే వారి వద్దకు ఈడీ, సీబీఐ వస్తాయని బాల్క సుమన్ చెప్పారు. ఉత్తరాదిన కీలకలంగా మారిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని, దక్షిణాదిన కేసీఆర్ కుమార్తె కవితను అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు. లిక్కర్ కేసులో ఉన్న మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఏపీలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పారు.

Also Read: చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సమయంలో .. ఇప్పుడు దాడులు

ట్రెండింగ్ వార్తలు