Benefits Of Ippapuvvuu For Pregnant Women
Benefits Of Ippapuvvuu for Pregnant Women : ఇప్పపువ్వు. అడవిబిడ్డలకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేవారికి ఇప్ప పువ్వు గురించి బాగా తెలుసు. ఇప్పపువ్వులను సేకరించి అమ్ముకుంటుంటారు గిరిజనులు. అడవుల్లో ఇప్పపువ్వులు విరివిరిగా ఉంటాయి. ఆయా కాలాల్లో ఇప్ప చెట్టు పువ్వులు పండి రాలిపోతుంటాయి. అలా రాలిపోయిన పువ్వులను సేకరించి వాటిని సమీపంలోని టౌనులకెళ్లి అమ్ముకుంటుంటారు గిరిజనులు.
ఇదిలా ఉంచితి ఈ ఇప్ప పువ్వుల గురించి ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే..ఇప్పపువ్వులతో చేసిన లడ్డూలను గిరిజన మహిళలకు పంపిణీ చేయనున్నారు అధికారులు. అదేంటీ ఇప్ప పువ్వులతో లడ్డూలు చేయటమేంటీ? వాటిని మహిళలకు పంచటమేంటీ? అనే డౌటు రావచ్చు. ఎందుకంటే ఇప్ప పువ్వుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా హిమో గ్లోబిన్ ను పెంచే సామర్థ్యం ఈ ఇప్ప పువ్వుల్లో ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఈ ఇప్ప పువ్వు ల లడ్డూలు పంపిణీ చేయనున్నారు అధికారులు.
ఇప్పపువ్వుతో తయారు చేసే సారాకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పపువ్వుతో చేసిన సారా భలే మత్తెక్కిస్తుంది. ఆదివాసీలకు ఇది మంచి ఆదాయ వనరు కూడా. అయితే ఈ పువ్వుతో మత్తెక్కించే సారాయే కాకుండా చాలా ప్రయోజనాలున్నాయి. భారత దేశంలోని మెజార్టీ ఆడవాళ్లలో రక్తహీనత (రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం) కనపడుతుంది. తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఏజెన్సీ గర్భిణుల్లో లక్షమందిలో 152 మంది, వెయ్యి మంది అప్పుడే పుట్టిన శిశువుల్లో48 మంది చనిపోతున్నారు. ముఖ్యంగా ప్రసవం సమయంలో రక్తస్రావం జరిగి తల్లీబిడ్డలు మరణిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంత మహిళల్లో ఆ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గర్భిణుల్లోనైతే హిమోగ్లోబిన్ 3నుంచి 5శాతం కూడా ఉండటం లేదు. దీంతో ఎర్ర రక్త కణాలు సంఖ్య తగ్గిపోతోంది. దీంతో గర్భిణుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. ప్రసవం సమయంలో ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయి.
వీటికి ఇప్పపువ్వు పరిష్కారం చూపిస్తుందని గుర్తించారు గిరిజన సంక్షేమ అధికారులు. గర్భిణుల్లో హిమోగ్లోబిన్ శాతం పెంచటానికి ఓ మార్గం ఎంచుకున్నారు. ఇప్ప పువ్వులో ఉండే ఐరన్ కు రక్త హీనత తగ్గించే లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇతర పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఇప్పపువ్వుతో చేసిన లడ్డూలను గర్భిణులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఏప్రిల్ నుంచి ఆరు నెలలు గర్భిణులకు అందించనున్నారు.