బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మ‌రో ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారం సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Venkat Rao Join To Congress

Telangana Congress Party : లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావుతో పాటు ఆయన వర్గీయులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read : నయా నాటకానికి తెరతీశారు..! కాంగ్రెస్ జనజాతర సభపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గం మినహా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. అయితే, గెలిచిన నాటినుంచి ఆయన కాంగ్రెస్ నేతలతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. గతంలో పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ రెడ్డితోనూ తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. అప్పుడే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, లోక్ సభ ఎన్నికల వేళ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

Also Read : CM Revanth Reddy : బిడ్డా గుర్తు పెట్టుకో.. నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని- కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం

బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుసైతం కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.