Bhatti Vikramarka: అమిత్ షా చెప్పినదానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపలేదు?: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు అమిత్ షా. దీనిపై హనుమకొండ జిల్లాలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

Batti Vikramarka

Bhatti Vikramarka: తెలంగాణలోని చేవెళ్లలో ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా (Amit shah) లౌకిక వాదానికి భిన్నంగా మాట్లాడినదానికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామనడంతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై పలు వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.

దీనిపై హనుమకొండ జిల్లాలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రాష్ట్రం నష్టపోతుందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం ఏంటని నిలదీశారు. అలాగే ఎంఐఎం, బీఆర్ఎస్ కి మధ్య ఉన్న ఒప్పందం ఏంటని ప్రశ్నించారు.

ఎస్సీ- ఎస్టీలకు భారత రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందని భట్టి విక్రమార్క చెప్పారు. ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్లు కల్పించేది ఏమిటని నిలదీశారు. జనగణనను వెంటనే మొదలు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బీసీ సబ్ ప్లాన్ ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు.

రాష్ట్రంలో 2 లక్షల 90 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడతారు కానీ, 54 శాతం ఉన్న బీసీలకు 5 శాతం బడ్జెట్ ఇస్తారా? అని నిలదీశారు. బీసీలకు 50 శాతం బడ్జెట్ కేటాయించాలని అన్నారు. కొత్త రాష్ట్రమని రెండోసారి కేసీఆర్ కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని చెప్పారు. నిధులు, నియామకాలు లేకుండా దోపిడీ చేశారని విమర్శించారు.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ ఎందుకు ఇవ్వలేదన్న విషయంపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే గత్యంతరం లేని పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని చెప్పారు. ప్రభుత్వాలు చెప్పిన మాటలకు, చేతలకు పొంతన లేదని అన్నారు.

Minister KTR : కాంగ్రెస్, బీజేపీని తప్పకుండా ప్రజలు బండకేసి కొడతారు : మంత్రి కేటీఆర్