Trs Party Office
TRS party office in Delhi : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి రేపు భూమి పూజ జరుగనుంది. గురువారం (సెప్టెంబర్2, 2021) మధ్యాహ్నం 1.48 గంటలకు వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లిన మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి మరియు ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలువురు వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరుగనుందని తెలిపారు. ఇప్పటివరకు ఏ దక్షిణాది పార్టీకి ఢిల్లీలో కార్యాలయం లేదు. ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్న తొలి దక్షిణాది పార్టీ తమదేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ పక్కన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. వసంత్ విహార్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయ భూమి పూజకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మట్టి చదును పనులు పూర్తయ్యాయి. భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
ఐదు అంతస్తుల్లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కానుంది. JDU, సమాజ్‌వాది పార్టీ కార్యాలయాల పక్కన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఎంబసీ కార్యాలయాలు, వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో కార్యాలయం నిర్మిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటుతో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర షోపించనుంది. 2020 అక్టోబర్ 9న 11 వందల చదరపు మీటర్ల భూమిని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్రం కేటాయించింది. పార్టీ ఆఫీస్ భూమి కోసం టీఆర్‌ఎస్ 8 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించింది.
సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత హస్తినబాట పట్టారు. బుధవారం (సెప్టెంబర్ 1, 2021) మధ్యాహ్నం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. హస్తినలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఎల్లుండి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మూడు రోజుల కేసీఆర్ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.