హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేము- హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెరువుల పరిరక్షణ ధ్యేయంగా రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Relief For Hydra (Photo Credit : Google)

Hydra : హైడ్రాకు బిగ్ రిలీఫ్ లభించింది. హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేమని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, సంస్థ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన వేర్వురు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది.

చెరువులు, నాలాల పరిరక్షణ ధ్యేయంగా రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీవో నెంబర్ 99 ద్వారా ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అయితే, ఈ జోవోని సవాల్ చేస్తూ కొంతమంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 99కి వ్యతిరేకంగా సుమారు 14 పిటిషన్లు దాఖలయ్యాయి. హైడ్రా జీవో 99ని వెంటనే రద్దు చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమంది. హైడ్రా ఏర్పాటును కోర్టు స్వాగతించింది. ఎందుకు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారంది. చెరువులు, నాలాలను పరిరక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగా హైడ్రా పని చేయాలని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం 14 పిటిషన్లు హైడ్రాకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి. దీనిపై భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అనేక ఇళ్లు కూల్చివేస్తున్నారని పిటిషనర్లకు సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కానీ, కోర్టు మాత్రం ఎక్కడా కూడా హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేదు. హైడ్రా ఏర్పాటును స్వాగతించింది. హైడ్రాపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో.. మొత్తం మీద ఈ పరిణామం హైడ్రాకు బిగ్ రిలీఫ్ గా చెప్పుకోవచ్చని అధికారులు అంటున్నారు. ఇటీవలి కాలంలో హైడ్రాపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమే హైడ్రాను స్వాగతించడం.. ఆ సంస్థకు, ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చే అంశంగా అధికారులు భావిస్తున్నారు.

మూసీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు నగరంలో చాలా చెరువులు, నాలాలు కబ్జాకు గురయ్యాయి. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు కట్టారు. చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. మరోవైపు హైడ్రా కారణంగా పేదలకు ఎలాంటి నష్టం జరిగినా.. వారికి పరిహారం కూడా చెల్లిస్తామని, ఇళ్లు కూడా ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇంకా చాలామంది హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో హైడ్రాను స్వాగతిస్తూ కోర్టు వ్యాఖ్యలు చేయడం భారీ ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. న్యాయస్థానం తీర్పుతో అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

 

Also Read : ఏనుగు మీద విసిరిన బాణం రివర్స్ కొట్టిందా? పరేషాన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..!