Hyderabad Cricket Association
HCA Case: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సీఐడీ, ఈడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుతోపాటు పలువురిని సీఐడీ అరెస్టు చేసింది. అయితే, తాజాగా.. ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
హెచ్‌సీఏలో అక్రమార్కుల వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని టీసీఏ (తెలంగాణ క్రికెట్ అసోసియేషన్) ఆరోపించింది. ఈ మేరకు టీసీఏ ప్రెసిడెంట్ యండల లక్ష్మీ నారాయణ, సెక్రెటరీ గురువారెడ్డిలు సీఐడీకి పిర్యాదు చేశారు. వారితోపాటు జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అంగర్వాల్, వంకా ప్రతాప్ లపై కూడా ఫిర్యాదు చేశారు. వీరిపై కూడా దర్యాప్తు చేయాలని సీఐడీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెచ్‌సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనక కేటీఆర్, కవిత హస్తం ఉందని అన్నారు. క్రికెట్ కు సంబంధం లేని ఈ ఇద్దరూ జగన్ వెంట ఉండి నడిపించారని ఆరోపించారు.
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవగానే నా విజయం కేటీఆర్, కవిత, హరీశ్ రావుకు అంకితం అని చెప్పాడని గుర్తు చేశారు. జగన్ వెనుక ఉన్న వాళ్ల పాత్ర కూడా నిగ్గు తేల్చాలని సీఐడీకి ఫిర్యాదు చేయడం జరిగిందని, హెచ్‌సీఏలో మరికొందరు అక్రమార్కులు ఉన్నారు.. వీళ్లపై కూడా దర్యాప్తు చేయాలని సీఐడీని కోరడం జరిగిందని టీసీఏ ప్రెసిడెంట్ యండల లక్ష్మీ నారాయణ, సెక్రెటరీ గురువారెడ్డిలు చెప్పారు.