Ration card holders
Ration Card: కొత్త రేషన్ కార్డుదారులు, కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారికి బిగ్ అప్డేట్. జూన్ నెలలో కొందరికి కొత్త రేషన్ కార్డులు మంజూరి అయిన విషయం తెలిసిందే. అయితే, కార్డు వచ్చినప్పటికీ వారు రేషన్ తీసుకోవాలంటే రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెలలోనే వారు రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఒకేసారి జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన ఉచిత బియ్యం కోటా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ వారికి సెప్టెంబర్ నెలలోనే రేషన్ కోటాను అందించనున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో కొత్తగా రేషన్ కార్డు అందుకున్న వారికిసైతం పాత కార్డుదారులతో కలిపి సెప్టెంబర్ నెలలోనే బియ్యం కోటా కేటాయింపు ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు లక్షకుపైగా కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలుస్తోంది. మరోవైపు పాత కార్డుల్లో సుమారు రెండు లక్షల కొత్త సభ్యులు (యూనిట్లు) పెరిగినట్లు సమాచారం. మూడు నెలల నుంచి మీ సేవ, ఆన్ లైన్ ద్వారా కొత్త కార్డుల కోసం దరఖాస్తు స్వీకరిస్తుండటంతో ఎఫ్ఎస్సీ లాగిన్ లో సుమారు మూడు లక్షలకు పైగా నమోదైనట్లు తెలుస్తోంది.
సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో మగ్గుతున్న పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులకుసైతం ఆమోదం లభిస్తోంది. దీంతో కొత్త కార్డులతో పాటు పాత కార్డుల్లో సభ్యుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.