దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయిన రాష్ట్రాల వలస కార్మికులను, విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో సహాయపడాలని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ కేంద్రాన్ని కోరారు.
ఇతర రాష్ట్రాల్లో బస్సుల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులతో సహా లక్షలాది మందిని తిరిగి రాష్ట్రాలకు తీసుకురావడం సాధ్యం కాదని, సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మోడీ.
బస్సుల ద్వారా ప్రజలను తిరిగి రాష్ట్రానికి తీసుకురావడం సాధ్యం కాని పని అని, బస్సులలో ఏదైనా ప్రదేశం నుంచి తీసుకుని రావాలంటే ఆరు నుండి ఏడు రోజులు పడుతుందని, మేము బస్సుల ద్వారా అలా చేస్తే ప్రజలను ఇంటికి తిరిగి తీసుకురావడానికి నెలలు సమయం పడుతుందని ఆయన అన్నారు.
ఒంటరిగా ఉన్న విద్యార్థులు, వలస కూలీలు.. తిరిగి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. అయితే వలస కార్మికులు, విద్యార్థులను ఇక్కడికి తరలిస్తే వారిని క్వారెంటైన్ చేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ సహాయం కోసం 27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఈ సంధర్భంగా ఆయన చెప్పారు. (మే 4 నుంచి షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్ ఓపెన్ )