Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపించారు. నూతన ఏడాదిలో అయినా హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల గొంతునొక్కిన ప్రభుత్వం.. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలన్నారు.
రైతు కూలీల సంగతి ఎందుకు మాట్లాడటం లేదు?
”రైతుభరోసా ఇస్తామని చెప్పి మోసం చేసింది. కౌలు రైతులకు 1200 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా మార్చేస్తున్నారు. రైతు కూలీల సంగతి ఎందుకు మాట్లాడటం లేదు? కాంట్రాక్టర్ల కోసం ఏమైనా దాస్తున్నారా? డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి. డబ్బు ఇవ్వకుండా ఎవరైనా ఆపుతున్నారా? సమాధానం చెప్పాలి. రైతు భరోసాపై వేసిన మంత్రివర్గ సబ్ కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి? కేబినెట్ మీటింగ్ లో రైతుభరోసాపై నిర్ణయం తీసుకోవాలి.
ఎకరాకు 12వేల రూపాయలు రైతుభరోసా ఎప్పుడు ఇస్తారో క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. 23వేల కోట్ల రూపాయలు ఒక సీజన్ కు రైతు భరోసా ఇవ్వాలి. రెండు సీజన్లకు కలిపి 46 వేల కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారు? కౌలు రైతులకు ఇస్తానన్న 12 వేలు ఇవ్వలేము అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ లో లేని కారణంగా గతంలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం తుమ్ముల నాగేశ్వరరావుకు తెలియదు.
Also Read : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి ఆమోదముద్ర
కాంగ్రెస్ ప్రభుత్వం 1,38,117 కోట్ల రూపాయల అప్పు చేసింది..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. పెట్టుబడి రాక ఇబ్బందులు ఎక్కువగా పడేది కౌలు రైతులే. 35 వేల కోట్ల రూపాయలు రైతన్నలకు ప్రభుత్వం బకాయి పడింది. వాటిని ఈ నెలలోనే రైతులు, కౌలు రైతులకు చెల్లించాలి. 1,38,117 కోట్ల రూపాయల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రోజుకు 354 కోట్ల రూపాయల అప్పు చేస్తుంది. ప్రతి గంటకు 14.75 కోట్ల రూపాయల అప్పు చేస్తుంది. ఎఫ్ఆర్ బీఎం పరిధిని దాటి అప్పు చేస్తుంది. భూమి తాకట్టు పెట్టి అప్పులు చేశారు.
Rythu Bharosa
30 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవం కాదా? రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయడం లేదు. రుణమాఫీ కూడా 60 నుంచి 65శాతం మాత్రమే చేసింది. 1.18 లక్ష కోట్ల రూపాయలు దేనికి ఖర్చు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం అప్పు తెచ్చి బిల్లులు చెల్లిస్తున్నారు. చిన్న కాంట్రాక్టర్లకు మొండి చేయి చూపిస్తున్నారు.
రైతుల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది ప్రజాపాలన కాదు మోసపు, అరాచక పాలన. మహాలక్ష్మి పథకం అమలు గురించి కూడా మాట్లాడటం లేదు. 14 వేల కోట్ల రూపాయలు కేటాయించి మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నా. పెన్షన్ ను 4 వేలకు పెంచి ఇచ్చేలా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు విధి విధానాలు ఏవో చెప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 80లక్షల దరఖాస్తులుదారులు ఉన్నారు. వారికి ఎన్ని సంవత్సరాల్లో ఇల్లు కేటాయిస్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు ఇస్తారా? గ్రామ సభ పెట్టి నిజమైన లబ్దిదారులను ఎంపిక చేస్తారా? ” అని రేవంత్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు మహేశ్వర్ రెడ్డి.
Also Read : తెలంగాణలో బాలికల గురుకులాలపై ఫోకస్.. అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు