బీఆర్ఎస్ పనైపోయింది.. రేవంత్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మరు: ఎంపీ లక్షణ్

దేవుడి పేరు చెప్పి రాజకీయం ఎవరు చేస్తున్నారనేది ప్రజలు ఆలోచించాలి. మసి పూసి మారేడు కాయ చేయాలనే రేవంత్ రెడ్డి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

BJP Leader K Laxman: బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయ్యిందని, OLXలో సేల్ అని పెట్టినా కొనేవాళ్ళు లేరని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్షణ్ ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని అన్నారు. ఈ రెండు పార్టీలు మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. అభద్రతా భావంతో ప్రజలను కాంగ్రెస్ అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు.

”దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఎన్నికల తరువాత 2 లక్షల రుణ మాఫీ చేస్తానని దేవుడి పేరుపై సీఎం రేవంత్ ప్రమాణం చేస్తున్నారు. దేవుడి పేరు చెప్పి రాజకీయం ఎవరు చేస్తున్నారనేది ప్రజలు ఆలోచించాలి. మసి పూసి మారేడు కాయ చేయాలనే రేవంత్ రెడ్డి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెసే. అలాంటి కాంగ్రెస్ ఈ రోజు లౌకికవాదం గురించి మాట్లాడుతూ మత రాజకీయాలు చేస్తోంది. CAA ముస్లింలకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు మతతత్వ రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జాతీయ వాదులను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారం విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Also Read: పద్మారావు నామినేష‌న్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు..?: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికి ప్రధానిగా మళ్లీ మోదీనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మోదీ సర్కారు కుల మతాలకు అతీతంగా పేద వారికోసం పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందేవారిలో ఎక్కువ శాతం పేద ముస్లింలు ఉన్నారు. సికింద్రాబాద్‌లో ఎవరు గెలిస్తే వారే దేశంలో అధికారం లోకి వస్తారని మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్ స్థానంలో గెలిచేది బీజేపీనే.. దేశంలో అధికారం చేపట్టేది కూడా బీజేపీనే. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల”ని ఎంపీ లక్షణ్ అన్నారు.

Also Read: అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్లీ పోటీ చేయను: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు

ట్రెండింగ్ వార్తలు