పద్మారావు నామినేష‌న్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు..? : రేవంత్ రెడ్డి

వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమయితే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వకూడా ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు.

పద్మారావు నామినేష‌న్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు..? : రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు దత్తాత్రేయను ఓడించి.. అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ లో మూడు రంగుల జెండా ఎగుర వేశారు. అప్పుడు కేంద్రంలో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 20ఏళ్ల తరువాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్ మూడు రంగుల జెండా ఎగరవేయబోతున్నారు. మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకోని పరిస్థితుల్లో అప్పట్లో అంజన్ కుమార్ యాదవ్ కు కేంద్ర మంత్రి పదవి రాలేదు. సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలుస్తుంది.. కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. దానం నాగేందర్ గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహించబోతున్నారని రేవంత్ అన్నారు.

Also Read : అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు

పద్మారావు నామినేషన్ కు వాళ్లెందుకు రాలేదు?
బీజేపీ నాయకులు గెలిచి కేంద్ర మంత్రులయినా హైదరాబాద్ కు చేసిందేంటి? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమయితే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వకూడా ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు. జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజలు దానం నాగేందర్ కు అండగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే సికింద్రాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.. దేశంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని రేవంత్ రెడ్డి అన్నారు. పద్మారావు పరువు తీసేందుకే కేసీఆర్ ఆయన్ను సికింద్రాబాద్ లో పోటీకి దింపారు. పద్మారావు నామినేషన్ కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీన్నిబట్టి సికింద్రాబాద్ సీటును కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని అర్థమవుతుంది. బస్తీల్లో ప్రజల కష్టాలు తీరాలంటే సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ ను గెలిపించండి. ప్రభుత్వం మనది.. సంక్షేమం మనది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయంచేసే బాధ్యత నాది అని రేవంత్ అన్నారు.

Also Read : ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన.. పోటాపోటీగా నేతల నామినేషన్లు

కేటీఆర్ చర్చకు సిద్ధమా?
హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చ పెడదాం. జంట నగరాల దాహార్తిని తీర్చింది ఎవరో చర్చపెడదాం.. చర్చకు కేటీఆర్ సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటువేస్తే మూసీలో వేసినట్లే. బీజేపీని ఓడించాలంటే దానం నాగేందర్ గెలవాలి. అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ జోడెద్దుల్లా నాకు అండగా ఉంటారు. నగరాన్ని అభివృద్ధి చేస్తారని రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టి మోదీ తెలంగాణను అవమానించారు. హిందువుల ఆస్తిని ముస్లింలకు పంచుతారని మోదీ మాట్లాడుతున్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మోదీ ఇలా మాట్లాడటం సరైంది కాదు. ఒకరి ఆస్తి ఇంకొకరికి ఎలా పంచుతారు? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని రేవంత్ అన్నారు. లక్ష మెజార్టీతో దానం నాగేందర్ ను గెలిపించాలని సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.