Rajasingh
రాజాసింగ్.. ది ఫైర్ బ్రాండ్. ఇలా మాట్లాడాలి.. ఇందుకోసం మాట్లాడాలనే లెక్కలు ఉండవ్ ఆయన దగ్గర ! అందుకే ప్రతీ మాట తూటాలా పేలుతుంటుంది. అలాంటి రాజాసింగ్.. ఇప్పుడు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. కమలం పార్టీ నేతలపై విమర్శలు అనే బాణాలను ఎక్కుపెడుతున్నారు. అసలు రాజాసింగ్‌కు ఇంత కోపం ఎందుకు.. ఆయన ఎక్కుపెడుతున్న బాణాలు ఎవరి మీద.. ఎందుకు వాళ్లను టార్గెట్ చేస్తున్నారు.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గుసగుస ఏంటి..
కొంతకాలంగా సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో రాజాసింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బీజేపీ నుంచి పాత సామాను వెళ్లిపోవాలంటూ.. ముందో బాంబ్ పేల్చారు. ఆ తర్వాత వరుసపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారు. కొత్తగా వచ్చే అధ్యక్షుడైనా.. సీఎంతో రహస్య సమావేశాలు పెట్టుకోకుండా.. పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేయాలని.. అలాంటి వ్యక్తిని జాతీయ నాయకత్వమే ఎంపిక చేయాలంటూ.. సంచలనానికి తెరతీశారు.
అక్కడితో ఆగారా అంటే.. జైలుకెళ్లొచ్చిన కార్యకర్తలను కూడా.. నాయకత్వం పట్టించుకోవడం లేదని చురకలు అంటించారు. ఇక తనపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడం వెనక.. బీజేపీ నేతలే ఉన్నారంటూ మరో బాంబ్ పేల్చారు. తనపై పీడీ యాక్ట్ పెట్టినప్పుడు అండగా ఉన్న అన్న.. ఇప్పుడు ఎటువైపు ఉన్నాడో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్ తీరు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
నెలరోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలపై.. రాజాసింగ్ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. దీంతో బీజేపీ ఆఫీస్‌లో ఏ ఇద్దరు కలుసుకున్నా.. రాజాసింగ్ మాటల మీదే చర్చలు చేస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు.. ఎందుకు అన్నారని ఆరా తీసే పనిలో పడ్డారు మరికొందరు. ఐతే నాంపల్లి బ్యాచ్‌గా ముద్రపడిన ఇద్దరు నేతలను ఉద్దేశించే.. పాత సామాను వెళ్లిపోవాలంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఓ ఎంపీని ఉద్దేశించి రాజాసింగ్ కామెంట్స్?
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తులు.. తనపై పీడీ యాక్ట్ పెట్టినప్పుడు సంబరపడ్డారంటూ.. తన సన్నిహితులతో చెప్తున్నారట రాజాసింగ్. ఇక జైలులో ఉన్నప్పుడు తనకు అండగా ఉన్న అన్న.. ఇప్పుడు ఎటువైపు ఉన్నాడో అర్థం కావడం లేదని.. ఓ ఎంపీని ఉద్దేశించి రాజాసింగ్ మాట్లాడినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
ఆవేశంలోనో.. అటెన్షన్ కోసమో కాదు.. వ్యూహాత్మకంగానే రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఆయన మాటల వెనక ఎంతో మర్మం దాగి ఉందని.. ఊరికే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నది సన్నిహితులు చెప్తున్న మాట. బీజేపీలో చేరినప్పటి నుంచే.. ఎంఐఎంతో పాటు సొంత పార్టీ నేతలతో యుద్ధం చేయాల్సి వస్తోందని.. దీంతో విసిగి వేసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
తాను సూచించిన వ్యక్తికి జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వకపోవడంతో.. రాజాసింగ్ బరస్ట్ అవుతున్నారన్నది మరికొందరి అభిప్రాయం. ఉమా మహేందర్‌ను గొల్కొండ జిల్లా అధ్యక్షుడినా నియమించిన రోజే… పార్టీకి హెచ్చరికలు జారీ చేశారని… వాటిని పెడచెవిన పెట్టడంతోనే రాజాసింగ్ తన ఆవేదనను ఈ రూపంలో బయట పెడుతున్నారనే చర్చ కూడా నడుస్తోంది.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ.. హిందూ టైగర్ అయిన రాజాసింగ్‌కు గౌరవం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని.. పార్టీలోని కట్టర్ హిందూ కార్యకర్తలు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ పెద్దలు.. ఆయనతో చర్చించాలని సూచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో.. పెద్దలు మాట్లాడితే రాజాసింగ్ కూల్ అవుతారో లేదో.. ఇప్పటికైనా ఆవేశం, ఆవేదన తగ్గించుకుంటారో వేచి చూడాలి మరి.