కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లు.. తెలంగాణ బీజేపీలో రచ్చకు దారి తీసింది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం అనుమతివ్వాలని కోరుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టింది రేవంత్ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ తరఫున ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు.
ఆయన ప్రస్తావించిన మాటలు పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. పార్టీ లైన్‌కు క్వైట్ అపోజిట్‌గా..అసెంబ్లీలో పాయల్ శంకర్ కామెంట్స్ చేశారని అంటున్నాయి పార్టీ శ్రేణులు. ముఖ్యంగా మేమెంతో మాకంతే అనే కాంగ్రెస్ నినాదాన్ని ఆయన ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నిస్తున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలే కాదు శాసనసభలో కూడా బీసీ రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు పాయల్ శంకర్. ఈ కామెంట్స్ బీజేపీలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీలుగా అన్నట్లుగా మారాయట.
బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ అనుకుంది. కాంగ్రెస్ అలా అనుకోవడానికి కారణం ముస్లింలను బీసీల్లో కలిపి రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించడమే. బీసీలతో కలిపి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీజేపీ ముందు నుంచి వ్యతిరేకిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని అమిత్ షా పదే పదే ప్రస్తావించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఆ రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామని ప్రకటించారు.
కానీ అందుకు భిన్నంగా అసెంబ్లీలో ముస్లింలతో కలిపి ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్దతు తెలపడం ఇప్పుడు పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేలు బీసీ బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడిన మాటలను బీజేపీ ఎంపీలు వ్యతిరేకిస్తున్నారట. పార్టీ లైన్‌లో ఉన్నవారు ఎవరైనా ముస్లింలతో కలిపి బీసీ రిజర్వేషన్లు ఉన్న బిల్లును వ్యతిరేకిస్తారని..అలాంటి బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని అంటున్నారట. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ప్రతి మాట జాతీయ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉందంటున్నారట.
ఇందుకే అగ్గిమీద గుగ్గిలం
ఇక్కడ తమ పార్టీని ఇరకాటంలో పెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని బీజేపీ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారట. బీసీలకు రిజర్వేషన్లు అంటూ ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఇరకాటంలో పడ్డట్టు అయిందట. 9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్లు చేర్చేందుకు కేంద్రం దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డి డెలిగేషన్ తీసుకెళ్తే బీజేపీ నేతలు వెళ్ళాలా లేదా అన్న దానిపై చర్చ నడుస్తోంది. బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు ముస్లింలతో కూడిన రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పైగా పార్టీ లైన్‌కు విరుద్ధంగా ముస్లింతో కూడిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఎమ్మెల్యేలు మద్దతు ఎలా ఇస్తారంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన పనికి జాతీయ నాయకత్వం తలలు పట్టుకునే పరిస్థితి వస్తుందని ఎంపీలు టెన్షన్ పడుతున్నారట.
ముందు నుంచి రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న కులగణనపై విమర్శలు చేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఇక్కడి ఎమ్మెల్యేల తీరుతో సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చిందట. బీసీ బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపే విధంగా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ కావడంతో బీజేపీ ఇరకాటంలో పడింది. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా మార్చిందట. ఈ ఇష్యూ ఎటు వైపు టర్న్ తీసుకుంటుందో..బీజేపీ జాతీయ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.