Arvind Dharmapuri : బీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది.. ఇక పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యే- ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న ఆరోపణ నిజమే అని జనం భావించారు. లిక్కర్ స్కాం కూడా ఈ పరిస్థితికి దోహదం చేసింది.

Arvind Dharmapuri On BRS Defeat (Photo : Google)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమితో కేసీఆర్ శకం ముగిసిందని, బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని అన్నారాయన. తెలంగాణలో ఇక కాంగ్రెస్-బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అరవింద్ చెప్పారు.

”ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. మూడు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవడం గ్రేట్. తెలంగాణలో ఒక ఏడాది క్రితం వరకు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే భావన ఉండేది. కానీ వైఫల్యం చెందాం. బీజేపీలో లోటుపాట్లు పరిశీలించి, చర్చ చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ శకం ముగిసింది. అందుకు సగం సంతోషంగా ఉంది. ఇది బీఆర్ఎస్ పతనానికి ప్రారంభం.

Also Read : టీడీపీకి లాభమేనా? తెలంగాణ ఫలితాలు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి?

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయనకు హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో హుందాతనంతో కూడిన ఆరోగ్యకర పరిస్థితులు మళ్లీ వస్తాయి. దాడుల సంస్కృతికి స్టాప్ పడుతుంది. భాష కూడా మారుతుంది అనుకుంటున్నా. రేవంత్ చేతికి పగ్గాలు ఇచ్చాక కూడా డిపాజిట్ రాని పరిస్థితి చూశారు. అక్కడి నుంచి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. కచ్చితంగా అభినందించాలి.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న ఆరోపణ నిజమే అని జనం భావించారు. లిక్కర్ స్కాం కూడా ఈ పరిస్థితికి దోహదం చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ లో నిలబడాల్సిన చోట కోరుట్ల ఎందుకు వెళ్ళావు అని అడిగారు. బీజేపీకి అభ్యర్థి లేని చోట వెళ్లి నా వంతు కృషి చేశా. ఓట్లు పెరిగాయి. నా పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు. కోరుట్ల తెలంగాణకే ఆదర్శం. నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా చూడడం కూడా ప్రజలకు వింతగా ఉండే. కాంగ్రెస్ బలపడటం వల్ల ఓట్లు చీలి కొన్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ తెలంగాణలో ఇకపై కాంగ్రెస్ – బీజేపీ మధ్యనే పోటీ.

Also Read : కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై వెంటకరమణా రెడ్డి గెలుపుకు కారణాలివే

నయా పైసా పంచకుండా మేము ఈ స్థాయికి చేరుకున్నాం. నా పక్కన బాల్కొండలో ఒక్క రోజులో రూ.34 కోట్లు బీఆర్ఎస్ పంచింది. దేశంలోనే ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న అసెంబ్లీ ఎన్నికలుగా మారాయి. కోరుట్లలో డబ్బు పంచకుండా నేను ఒక ప్రయోగం చేశాను. ఓడిపోయినా సరే.. అన్ని ఓట్లు ఇవ్వడం అంటే కోరుట్ల ప్రజల విజయం. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జారుకుంటారు. ప్రజల్లో అభిమానం పోయింది. సహజ మరణం మాదిరిగా ఆ పార్టీ పతనం అవుతుంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూడా రావొద్దని నేను కోరుకుంటున్నా. ఆయన, ఆయన భాష, తీరు ఏదీ వద్దు” అని ఎంపీ అరవింద్ అన్నారు.