AP Politics : టీడీపీకి లాభమేనా? తెలంగాణ ఫలితాలు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి?

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ సహకరిస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.

AP Politics : టీడీపీకి లాభమేనా? తెలంగాణ ఫలితాలు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి?

Telangana Results Impact On AP Politics

తెలంగాణలో ప్రభుత్వ మార్పుతో ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పడింది. టీఎస్ లో కాంగ్రెస్ విజయం ఏపీ పాలిటిక్స్ పై ఎలాంటి ప్రభావం చూపనుంది? తాజా రాజకీయ పరిణామాలు టీడీపీకి లాభం చేకూరుస్తాయా? లేక వైసీపీకి ప్లస్ అవుతాయా? అన్న చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అది తమకు లాభిస్తుందని టీడీపీ అంచనా వేస్తుంటే.. లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు వైసీపీ నేతలు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రజలు, నాయకుల ఆసక్తి..
తెలంగాణ, ఏపీ విడిపోయిన పదేళ్లు గడిచినా ఒక రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు మరో స్టేట్ పై ప్రభావం చూపిస్తుంటాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏపీ నేతలు, ప్రజలు. చంద్రబాబు అరెస్ట్ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై పడుతుందా? ఆ అంశం ఏ పార్టీకి నష్టం కలిగిస్తుందనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరిగింది. ఇక్కడ వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో ఏపీ నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బంధుత్వాలు కూడా ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికలపై ఎక్కువ ఆసక్తి చూపించారు ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులు.

Also Read : కేసీఆర్ ఇలా చేసుంటే.. బీఆర్ఎస్ ఓటమి తప్పేదా?

ఆందోనళలో వైసీపీ..?
సంక్షేమానికి పెద్ద పీట వేసి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా.. ప్రజా వ్యతిరేకతను మాత్రం మూటగట్టుకుంది బీఆర్ఎస్. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలు మొత్తం తారుమరయ్యాయి. అయితే, తెలంగాణ పరిణామాలు ఏపీలో తమకు కొంచెం ఇబ్బందిగా మారతాయని భావిస్తోంది వైసీపీ. ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి బీఆర్ఎస్ సహకరించిందని, ఆ కృతజ్ఞతతో ఈసారి గులాబీ పార్టీ గెలుపు కోసం వైసీపీ సాయం చేసిందన్న ప్రచారమూ జరిగింది.

టీడీపీకి ఊపిరినిచ్చిన తెలంగాణ ఫలితాలు.!
ఇన్నాళ్లూ బీఆర్ఎస్ తో ఫ్రెండ్లీగా ఉన్న వైసీపీకి తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఇబ్బందిగా మారింది. ఇదే ఊపుతో కాంగ్రెస్ ఏపీలో కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే.. అది తమకు ఇబ్బందిగా మారుతుందని వైసీపీలో చర్చ మొదలైంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీకి మాత్రం తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఊపిరినిచ్చాయనే చెప్పొచ్చు. కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో అక్కడక్కడా టీడీపీ శ్రేణులు కూడా రోడ్డెక్కాయి. సాక్ష్యాత్తు హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి నివాసంతో పాటు గాంధీభవన్ కు పసుపు జెండాలతో వెళ్లిన కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో వారి ఆనందానికి అవధులు లేవు.

ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ సహకరిస్తుందా?
తొలి నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబుకి అత్యంత గౌరవం ఇస్తూ వస్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు పలికేలా చేయడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణలో జరిగిన ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిచ్చింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ సహకరిస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తో అనైతికంగా కలిసిపోయిందని, ఓట్లు మొత్తం కాంగ్రెస్ కు గంపగుత్తగా వేయించిందని ఆరోపిస్తున్నారు. గాంధీభవన్ లో జరిగిన సంబరాల్లో కాంగ్రెస్ తో పాటు టీడీపీ జెండాలు కనిపించడాన్ని తప్పుపట్టారు వైసీపీ నేతలు.

Also Read : తిరుగే లేదనుకున్న కారు ఎక్కడ బోల్తా పడింది? బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు అవేనా?

ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు?
ఏపీలో జరగనున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమైంది. ఈ సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే, తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే చర్చ టీడీపీ, బీజేపీ నేతల్లో సాగుతోంది. అయితే సింహాచలంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. కాంగ్రెస్ తో పొత్తు విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఏపీలో రాక్షస పాలన పోవాలని స్వామి వారిని కోరుకున్నట్లు మాత్రం తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ సహకరించిన నేపథ్యంలో ఏపీలో కూడా అలాగే అనధికార వ్యూహాలతో ముందుకు సాగితే విజయం సాధించొచ్చు అన్న ధీమాతో పసుపు పార్టీ ఉంది. మరోవైపు తెలంగాణ ఫలితాలు ఏపీపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో బేరీజు వేస్తున్న వైసీపీ.. తమ వ్యూహాలకు పదును పెడుతోంది.